కానిస్టేబుల్ చేతుల్లో చెంప దెబ్బ : రేపు మీకూ జరగొచ్చు , బాలీవుడ్ మౌనంపై కంగన ఘాటు వ్యాఖ్యలు
హోరాహోరీగా జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో పలువురు సినీతారలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో కొందరు గెలిస్తే, మరికొందరు ఓటమి పాలయ్యారు. గెలిచినవారిలో ఒకరు బాలీవుడ్ క్వీన్ , ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కంగనా.. తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్ధి విక్రమాదిత్యపై దాదాపు 74,755 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. హిమాచల్‌ప్రదేశ్‌కు సీఎంగా పనిచేసిన వీరభద్రసింగ్ కుమారుడే విక్రమాదిత్య. రాష్ట్రంలోని బలమైన కుటుంబాలకు చెందిన వ్యక్తిని, అందులోనూ కాంగ్రెస్ అధికారంలో కంగనా ఓడించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
అయితే ఎన్నికల్లో గెలిచిందో లేదో అప్పుడో ఆమె వివాదంలో ఇరుక్కుంది. నిన్న తన నియోజకవర్గంలో విజయోత్సవ సంబరాల్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో చండీగఢ్ విమానాశ్రయంలో కంగనపై డ్యూటీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చేయి చేసుకుంది. దీంతో ఇద్దరి మధ్యా కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ఉన్నతాధికారులకు సదరు కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసి కంగనా రనౌత్ వెళ్లిపోయారు. కానీ దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కాస్తా వివాదం కాగా.. తనకు బాలీవుడ్ నుంచి ఎలాంటి మద్ధతు లభించకపోవడం పట్ల కంగనా రనౌత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. '' నాపై విమానాశ్రయంలో జరిగిన ఘటనపై మీరు (చిత్ర పరిశ్ర) మౌనంగా ఉండొచ్చు లేక సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. భవిష్యత్తులో మీరు మనదేశంలోనైనా, విదేశాల్లోనైనా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటూ .. ఇజ్రాయెల్ , పాలస్తీనాలకు చెందినవాళ్లు మీపై , మీ పిల్లలపై దాడికి పాల్పడవచ్చు. ఇజ్రాయెల్ బందీల కోసమో లేదంటే రఫాపై మీ అభిప్రాయం చెప్పినందుకు ఇలా జరగొచ్చు. ఆ సమంలో మీ భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం వంటి హక్కుల కోసం నేను పోరాడుతున్నానని మీరే గ్రహిస్తారు. నేను అలా ఉన్నందుకు మీరే ఆశ్చర్యపోతారు, ఎందుకంటే నేను మీలాంటి దానిని కాదు '' అంటూ ఇన్‌స్టా స్టోరీలో కంగనా రాసుకొచ్చారు. కానీ కాసేపటికే ఆ పోస్టును ఆమె డిలీట్ చేశారు.
ఈ పోస్టులో ఇజ్రాయెల్, పాలస్తీనా అంశాన్ని కంగనా ప్రస్తావించడంపై ఓ కారణం ఉంది. ఇటీవల రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ.. పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు కాల్పుల విరమణను పాటించాల్సిందిగా '' ఆల్ ఐస్ ఆన్ రఫా '' అంటూ ఇరుదేశాలను అభ్యర్ధించారు. తనపై ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే వారి నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకకపోవడమే కంగనా రనౌత్ ఆగ్రహానికి కారణం కావొచ్చు. వారికి చురకలంటించేలా తన ఇన్‌స్టా స్టోరీ ప్రారంభంలో '' ఆల్ ఐస్ ఆన్ రఫా '' అని ఆమె రాసుకొచ్చారు. కానీ తర్వాత కాసేపటికే కంగనా రనౌత్ తన పోస్టులోని కొంత భాగాన్ని డిలీట్ చేశారు. మరి దీనిపై హిందీ చిత్ర పరిశ్రమ ఎలా స్పందిస్తోంది వేచి చూడాలి.
అయితే కంగనా తాజా వివాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎయిర్‌పోర్టు నిబంధనల ప్రకారం కంగనాను లగేజ్ స్కాన్ చేసే సమయంలో తన ఫోన్‌ను ట్రేలో వేయకపోవడంతో పాటు విధుల్లో ఉన్న సిబ్బందిని పక్కకు తోసివేయడంతో అనుకోకుండా ఈ ఘటన జరిగిందని నెటిజన్లు, కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. కానీ గతంలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనలను కంగన తప్పుబట్టింది. అంతేకాదు.. నిరసనలు చేస్తున్న అన్నదాతలను ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చడం, రూ.100, రూ.200 కోసం దీక్షలో కూర్చొంటున్నారంటూ హేళనగా మాట్లాడింది. ఆ పోరాటంలో సదరు కానిస్టేబుల్ అమ్మ, కూడా ఉందని అందుకే నాటి వ్యాఖ్యలు గుర్తొచ్చి కంగనాపై దాడి చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా కుల్విందర్ ఓ వీడియోలో పేర్కొంది.
వివాదం నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించారు. కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఆమెపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు సీఐఎస్ఎఫ్ స్పష్టం చేసింది. కంగనాపై దాడి ఘటనను జాతీయ మహిళా కమీషన్ సైతం తీవ్రంగా ఖండించింది. 35 ఏళ్ల కుల్విందర్ 2009లో సీఐఎస్ఎఫ్‌లో చేరారు. 2021 నుంచి చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సేవలందిస్తున్నారు. అంతేకాదు ఆమె భర్త కూడా సీఐఎస్ఎఫ్‌లోనే పనిచేస్తుండగా.. సోదరుడు రైతు నాయకుడు.


Click it and Unblock the Notifications











