సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్.. అసలేం జరిగిందంటే?
Jacqueline Carrieri Dies: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇక నటీనటులు అంటే అన్ని క్యారెక్టర్లలోనూ కనిపిస్తూ అందరినీ అలరించాలి. వారికి ఎంత వయసు వచ్చినా అది కనిపించకుండా కవర్ చేసుకుంటూ సాగిపోతుండాలి. అదే వారికి సినిమాల్లో అవకాశాలను ఇస్తుంటుంది. అందం తగ్గినా, లావు పెరిగిననా, బరువు తగ్గినా సినిమా ఛాన్సులు తగ్గిపోతుంటాయి. మరి అలాంటి రంగుల లోకంలో బతికే వాళ్లంతా... అందం కోసం తెగు పాకులాడుతూ ఉంటారు. డైటింగ్ లు, వర్కౌట్లు చేస్తూ తెగ కష్టపడిపోతూ ఉంటారు. మరికొందరేమో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని తమ శరీరంలోని భాగాలను అందంగా మలుచుకుంటారు. ఇలా ఇప్పటి వరకు చాలా మంది నటీనటులు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.
అయితే తాజాగా అర్జెంటీనాకు చెందిన ఓ అందాల తార కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. కానీ దురదృష్టవశాత్తు అది వికటించి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరెవరో కాదు.. నటి జాక్వెలిన్ కరీరీ. తెలుగు, భారతీయ ప్రజలకు ఈమె గురించి పెద్దగా తెలియకపోయినప్పటికీ.. అర్జెంటీనాలో మాత్రం ఆమె చాలా ఫేమస్. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. 48 ఏళ్ల వయసున్న ఈ ముద్దుగుమ్మ కాలిఫోర్నియాలో కన్నుమూసింది. అయితే సర్జరీ చేస్తున్న సమయంలో ఆమె శరీరంలోని రక్తం గడ్డ కట్టడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

అక్టోబర్ ఒకటవ తేదీన జాక్వెలిన్ కరీరీ మృతి చెందగా.. ఈరోజు ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 1996 అందాల పోటీల్లో రన్నరప్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ... లాటిన్ అమెరికన్ సినిమాల్లో నటించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈక్రమంలోనే సోషల్ మీడియా వేధికగా ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులకు ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నటీనటులు తమ అందానికి మెరుగులు అద్దుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. అయితే ఈ సర్జరీ సమయంలో.. ముఖ్యంగా కాస్మెటిక్ సర్జరీకి ఉపయోగించే రసాయనాలు గుండె కొట్టుకోవడాన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తాయి. ఒక్కసారిగా గుండె స్పందన రేటు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. దీని వల్ల శ్వాస ఆడక పోవడం, గుండెపోటు, రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటివి జరిగి ప్రాణాలు కోల్పోతుంటారు. అందుకే చాలా మంది ఆరోగ్య నిపుణులు ఆ ప్లాస్టిక్ సర్జరీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అందం కోసం ప్రాణాలు పోగొట్టుకోకూడదని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్లాస్టిక్ సర్జరీల కారణంగా పలువురు భారతీయ నటులు కూడా చనిపోయారు. టాలీవుడ్ కు చెందిన ఆర్తి అగర్వాల్, కన్నడ నటి చేతన్ రాజ్ కాస్మొటిక్ సర్జరీ వల్లే ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అర్జెంటీనా అందాల సుందరి జాక్వెలిన్ కరీరీ మృతి చెందారు.


Click it and Unblock the Notifications











