Adipurush: పఠాన్ రికార్డు బ్రేక్ చేసిన ఆదిపురుష్.. ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ షాక్!
కొన్నేళ్లుగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా తన రేంజ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న అతడు.. ఇప్పుడు 'ఆదిపురుష్' అనే చిత్రంతో రాబోతున్నాడు. రామాయణం నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక బిజినెస్‌ను జరుపుకున్న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
ప్రభాస్ - ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమాను జూన్ 16వ తేదీన విడుదల చేస్తున్నారు. దీంతో ఇండియాలోని చాలా ఏరియాల్లో ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ముఖ్యంగా ముంబై, న్యూ ఢిల్లీ, లక్నో, కోల్‌కతా సహా దేశంలోని చాలా ప్రధాన పట్టణాల్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఫలితంగా ఇప్పటికే మూడు లక్షలకు పైగా టికెట్లు కూడా అమ్ముడైపోయాయి. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం మరో రికార్డును క్రియేట్ చేసింది.

'ఆదిపురుష్' మూవీ వివరాలను ప్రముఖ టికెటింగ్ వెబ్‌సైట్ బుక్‌మైషో చాలా రోజుల క్రితమే అందులో పొందుపరిచింది. దీంతో ఈ సినిమాపై ఎంతో మంది ఆసక్తిని తెలుపుతున్నారు. ఇలా తాజాగా ఈ మూవీ బుక్‌మైషోలో 722K మంది ఆసక్తిని పొందింది. తద్వారా 'పఠాన్' మూవీ పేరిట ఉన్న రికార్డు (721K)ను ఇది బ్రేక్ చేసేసింది. అంతేకాదు, షారూఖ్ ఖాన్ మూవీ రిలీజ్ సమయానికి అన్ని ఇంట్రెస్ట్‌లు సాధించగా.. ప్రభాస్ చిత్రం మాత్రం విడుదలకు మూడు రోజుల ముందే టాప్ ప్లేస్‌కు చేరింది. ఇదే ఊపు కంటిన్యూ అయితే 1 మిలియన్ మార్కును చేరుతుంది. ఇక, ఈ లెక్కలు చూసి బాలీవుడ్ షాక్ అయినట్లు తెలుస్తోంది.

ఇక, 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తా హనుమంతుడిగా నటించారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మించారు. దీనికి అజయ్ - అతుల్ సంగీతాన్ని ఇచ్చారు.


Click it and Unblock the Notifications











