శ్రీదేవి నివాసంలో అజిత్, షాలిని.. భార్య జ్ఞాపకాలతో విషాదంలో బోనీ కపూర్!
అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఏడాది పూర్తి కావొస్తోంది. మరో 10 రోజుల్లో శ్రీదేవి ప్రధమ వర్ధంతి జరగనుంది. ఈ నేపథ్యంలో బోనికపూర్ కుటుంబ సభ్యులు చెన్నైలోని శ్రీదేవి నివాసంలో కొన్ని ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సెలెబ్రిటీలు కూడా పాల్గొన్నారు. శ్రీదేవి గత ఏడాది ఫిబ్రవరి 24న దుబాయ్ లో మరణించిన సంగతి సంగతి తెలిసిందే. ఊహించని మరణంతో దేశం మొత్తం షాక్ కి గురైంది.

ఆకస్మిక మరణం
శ్రీదేవి 50 ఏళ్ల వయసులో కూడా చాలా చలాకీగా, ఆరోగ్యంగా ఉండేది. అలాంటి శ్రీదేవి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లి అక్కడ హోటల్ లో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి మరణించడం ఎవరికీ అంతు చిక్కని విషయం. మూడు రోజుల హై డ్రామా తర్వాత శ్రీదేవి మృత దేహం ఇండియాకు తరలించారు. అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య శ్రీదేవి అంత్య క్రియలు జరిగాయి.

శ్రీదేవి ప్రథమ వర్థంతి
మరో 10 రోజుల్లో శ్రీదేవి ప్రథమ వర్ధంతి జరగనుంది. బోనికపూర్, అతని కుటుంబ సభ్యులు చెన్నైలోని శ్రీదేవి నివాసంలో ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోనికపూర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అనిల్ కపూర్, శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషి అక్కడే ఉన్నారు. ఇక శ్రీదేవిని అమితంగా అభిమానించే తమిళ స్టార్ హీరో అజిత్ తన సతీమణి షాలినితో కలసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విషాదంలో బోనికపూర్
శ్రీదేవి జ్ఞాపకాలని గుర్తు చేసుకున్న బోనికపూర్ విషాదంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. శ్రీదేవిని అభిమానించే టాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త అయిన టి సుబ్బిరామిరెడ్డి కూడా శ్రీదేవి ప్రార్థన కార్యక్రమానికి హాజరయ్యారు. సుబ్బిరామిరెడ్డితో ఉన్న ఫొటోలో కూడా బోనికపూర్ ఎమోషనల్ గా కనిపించారు. బోనికపూర్ నిర్మాణంలో అజిత్ పింక్ చిత్ర రీమేక్ లో నటిస్తున్నాడు. శ్రీదేవి జీవించి ఉన్నప్పుడు అజిత్ తో ఓ సినిమా నిర్మించాలని అనుకుంది. కానీ అది కలగానే మిగిలిపోయింది. అజిత్ శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రంలో కామియో రోల్ చేశాడు.

కుమార్తెని నటిగా
ఇక తన పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ని స్టార్ హీరోయిన్ గా చూడాలని, అందుకోసం జాన్విని అన్ని విధాలుగా సిద్ధం చేసింది. జాన్వీ బాలీవుడ్ లో తొలి చిత్రంలో నటించబోతోంది అనగా శ్రీదేవి మరణించింది. దురదృష్టవశాత్తూ జాన్విని హీరోయిన్ గా చూడకుండానే శ్రీదేవి మరణించింది. అన్ని భాషల్లో దిగ్విజయంగా నటించి స్టార్ గా ఎదిగిన ఏకైన నటి శ్రీదేవి అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











