అక్షయ్ ది గ్రేట్.. మొన్న 25 కోట్లు.. మళ్లీ 3 కోట్ల విరాళం
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి మానవత్వాన్ని చాటుకొన్నారు. కరోనాపై పోరాటంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సేవలందిస్తున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) కార్మికులకు అక్షయ్ అండగా నిలిచారు. ఇప్పటికే ప్రధాని కేర్ ఫండ్‌కు రూ.25 కోట్లు విరాళం ప్రకటించిన స్టార్ హీరో.. తాజాగా బీఎంసీకి మరో మూడు కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అక్షయ్ పీఆర్ టీమ్ ధృవీకరించింది.
కరోనావైరస్‌తో లాక్‌డౌన్ ప్రకటించడం, విధుల్లో బీఎంసీ ఉద్యోగులు పీపీఈ వసతులు లేక ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలుసుకొన్న అక్షయ్ వెంటనే స్పందించారు అని బీఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. సోషల్ డిస్టెన్స్‌ను పాటించాలని ప్రచారం చేస్తున్న అక్షయ్ మాకు కొన్ని కనీస వసతులు కల్పించడానికి ఆర్థిక సహాయం అందించారు బీఎంసీ అధికారులు పేర్కొన్నారు.

బీఎంసీ జాయింట్ కమిషనర్ అశుతోష్ సలీల్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి అక్షయ్ కుమార్ మాతో టచ్‌లోనే ఉన్నారు. కార్మికుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ కోసం ఆర్థిక సహాయం అందించారు అని బీఎంసీ కమిషనర్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్షయ్ మాకు అండగా నిలువడం చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.
అక్షయ్ కుమార్‌తోపాటు బాలీవుడ్ ప్రముఖులు హృతిక్ రోషన్, సాజిద్ నడియావాలా, సల్మాన్ ఖాన్ తదితరులు ప్రధాని నిధికి విరాళం ఇవ్వడంతోపాటు బీఎంసీకి అండగా నిలిచారు.


Click it and Unblock the Notifications











