వారి కోసం మరో రూ. 2 కోట్లు.. కొనసాగుతున్న అక్షయ్ సాయం.. ఇప్పటికి రూ. 30 కోట్ల భారీ విరాళం!
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల మంది కరోనా బారినపడ్డారు. దాదాపు వెయ్యి మంది ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలకు, ప్రజలకు సాయం చేసేందుకు సినీ తారలు ముందుకు వచ్చారు.
Recommended Video

ప్రభుత్వాలకు అండగా సెలెబ్రిటీలు..
కరోనా వైరస్‌పై పోరాడేందుకు సెలెబ్రిటీలందరూ ప్రభుత్వాలకు అండగా నిలబడ్డారు. తమకు తోచిన సాయాన్ని ఆర్థిక విరాళంగా ప్రకటించారు. మరికొందరు స్వయంగా రంగంలోకి దిగి ప్రజలకు నేరుగా సాయాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియాలోని సినీ స్టార్స్ అందరికంటే ఎక్కువ మొత్తంలో విరాళాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అక్షయ్ కుమార్.

ప్రధాని నిధికి రూ.25కోట్ల విరాళం..
కరోనాపై పోరాడేందుకు దాతలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చాడు. ఈ మేరకు పీఎం కేర్స్‌కు విరాళాలు వెల్లువెత్తాయి. మొదటగా అక్షయ్ కుమార్ రూ.25కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. అంతటితో ఊరుకోకుండా మరిన్ని సేవా కార్యక్రమాల కోసం దానం చేస్తూనే ఉన్నాడు.

మున్సిపల్ కార్పోరేషన్‌కు..
పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 కోట్ల విరాళాన్ని ఇచ్చిన అక్షయ్.. మున్సిపల్ కార్మికుల శ్రమను కూడా గుర్తించాడు. కరోనాపై చేసే పోరాటంలో వారి ఆవశ్యకతను గుర్తించి.. ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు రూ.3 కోట్లు విరాళం అందించాడు.

తాజాగా మరో రెండు కోట్లు..
లాక్ డౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు సైతం కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. మన కోసం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సంరక్షణ కోసం ముంబై పోలీస్ ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు దీనిపై ముంబై పోలీస్ శాఖ అక్షయ్‌కు ధన్యవాదాలను తెలియజేసింది. ఇక సోషల్ మీడియాలో అక్షయ్ పేరు మరోమారు మార్మోగిపోతోంది.


Click it and Unblock the Notifications











