2.0 తర్వాత శంకర్-అక్షయ్ కాంబినేషన్లో మరో సినిమా?
కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'భారతీయుడు'(ఇండియన్) సినిమా అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ప్రస్తుతం 2.0 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న శంకర్ ఈ మూవీ రిలీజ్ తర్వాత 'భారతీయుడు 2' షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కమల్ హాసన్ హీరోగా రూపొందబోయే 'భారతీయుడు 2' లో విలన్ పాత్రను బాలీవుడ్ నటుడు అజయ్ దేవన్‌తో చేయించాలనుకున్నారు. అయితే ఇతర కమిట్మెంట్స్ వల్ల అజయ్ దేవగన్ తప్పుకున్నారట. ఈ నేపథ్యంలో ఆ పాత్రను అక్షయ్ కుమార్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... 'ఇండియన్ 2'లో విలన్ రోల్ చేయాలని శంకర్ కోరాడని, అందుకు అక్షయ్ కుమార్ పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. శంకర్‌తో పని చేయడాన్ని ఈ బాలీవుడ్ స్టార్ ఎంతో ఇష్టపడుతున్నారని, ఈ చిత్రాన్ని కూడా 'లైకా ప్రొడక్షన్స్' వారు నిర్మిస్తుండటంతో అక్షయ్ ఓకే చెప్పినట్లు టాక్.
2.0 సినిమా తరహాలోనే 'ఇండియన్ 2' చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో బహుభాషా చిత్రంగా తెరకెక్కించేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సౌత్ స్టార్స్ శింబు, దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, నయనతార ముఖ్యమైన పాత్రలకు ఎంపికైనట్లు సమాచారం. అక్షయ్ కుమార్ కూడా చేరితో ఇండియన్ సినీ చరిత్రలో ఇది మరో అతిపెద్ద మూవీగా అవతరించడం ఖాయం.
ఫస్ట్ పార్ట్ 'ఇండియన్' అవినీతి, లంచగొండితనం మెయిన్ సబ్జెక్టుగా తెరకెక్కించారు. ఇందులో కమల్ హాసన్ స్వాతంత్ర్య సమరయోధుడు సేతుపతి, ఆయన కుమారుడుగా ద్విపాత్రాభినయం చేశారు. మనీషా కొయిరాలా, ఊర్మిలా మండోద్కర్ హీరోయిన్లుగా నటించారు.


Click it and Unblock the Notifications











