ఆకాశానికి హద్దు లేదు: ‘మిషన్ మంగళ్’ పోస్టర్ అదిరిపోయింది!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజు అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారత కీర్తి పతాకాన్ని భూమి మీద నుంచి మార్స్(అంగారక గ్రహం) వరకు తీసుకెళ్లిన మిషన్ వెనక ఉన్న అండర్‌డాగ్స్ ఎవరు? అనే విషయాలను వెల్లడిస్తూ 'మిషన్ మంగళ్' అనే సినిమాతో థియేటర్లో ల్యాండ్ అవుతున్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ పేజీ ద్వారా విడుదల చేశారు. అక్షయ్ కుమార్‌తో విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పన్ను, క్రితి కుల్హరి, నిత్యా మీనన్, శర్మాన్ జోషి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విజయవంతంగా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ 'మంగళయాన్' గురించి ఈ చిత్రం సాగుతుంది.

మూవీ పోస్టర్ తన ట్విట్టర్ పేజీ ద్వారా షేర్ చేస్తూ... 'ఇండియాను మార్స్ వరకు తీసుకెళ్లిన మిషన్ వెనక ఉన్న అండర్‌డాగ్స్ గురించి ఈ ప్రపంచానికి చెప్పే కథే 'మిషన్ మంగళ్'' అని వెల్లడించారు. ఈ సినిమా ముఖ్యంగా నా కూతురు కోసం, ఆమె వయసులో ఉండే పిల్లల కోసం చేశాను. ఇలాంటి అద్భుతమైన స్టోరీ భావి పౌరులకు చెప్పాల్సిన అవసరం ఉంది అని అక్షయ్ కుమార్ తెలిపారు.
'మిషన్ మంగళ్' చిత్రానికి జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, ఆర్ బాల్కి, అరుణ భాటియా, అనిల్ నాయుడు నిర్మిస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. వాల్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











