హీరో అక్షయ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం... పల్టీలు కొట్టిన కారు, భయానకంగా పరిస్ధితి
బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ ప్రయాణిస్తున్న కారుకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. అక్షయ్ ఆయన భార్య ట్వింకిల్ ఖన్నాలు సోమవారం రాత్రి విదేశీ పర్యటన ముగించుకుని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తమ నివాసానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అక్షయ్ కుమార్ - ట్వింకిల్ ఖన్నాలు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఇటీవల విదేశాలకు వెళ్లారు. తమ పర్యటనను ముగించుకుని సోమవారం రాత్రికి ముంబైకి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి జుహులోని తమ నివాసానికి బయల్దేరారు. స్థానిక ముక్తేశ్వర్ రోడ్ సమీపానికి రాగానే ఓ మెర్సిడెస్ బెంజ్ కారు .. ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆ వేగానికి సదరు ఆటో.. ఇవతలి వైపు వెళ్తున్న అక్షయ్ కుమార్ కాన్వాయ్‌లోని సెక్యూరిటీ వాహనంపైకి దూసుకెళ్లింది. ఆ వెంటనే ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో అది పల్టీలు కొడుతూ వెళ్లి అక్షయ్ దంపతులు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టింది. వీరి కారుతో పాటు వెనుక వస్తున్న కార్లు ఒకదాని వెనుక మరొకటి ఢీకొని ఆ ప్రాంతంలో భయానక పరిస్ధితి నెలకొంది.
ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని వాహనదారులు, పాదచారులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో అక్షయ్ కుమార్ దంపతులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ తీవ్రతను పసిగట్టిన అక్షయ్, ఆయన భద్రతా సిబ్బంది వెంటనే బాధితులకు సాయం చేసేందుకు రంగంలోకి దిగారు. అక్షయ్ కుమార్ స్వయంగా తన సెక్యూరిటీ కారు కింద నలిగిపోయిన ఆటోలో నుంచి డ్రైవర్, మరో ప్రయాణికుడిని అతి కష్టం మీద బయటకు తీసి గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ముంబై ట్రాఫిక్, పోలీస్ ఇతర అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అక్షయ్ దంపతులను కట్టుదిట్టమైన భద్రత మధ్య జుహులోని నివాసానికి తరలించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో.. కారు పల్టీలు కొట్టి నిట్ట నిలువునా నిలబడిపోవడం, అక్షయ్ కుమార్ సాయం, భద్రతా సిబ్బంది సహాయక కార్యక్రమాలు తదితర వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. అక్షయ్ కుమార్ కారుకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు, బాలీవుడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. అయితే అక్షయ్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరిగా, దేశంలోనే అత్యధికా పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరిగా అక్షయ్ కుమార్‌కు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన పాపులారిటీ, సినీ, రాజకీయ ఇతర ప్రముఖులతో ఉన్న పరిచయాల నేపథ్యంలో అక్షయ్ కుమార్‌కు పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను కల్పిస్తోంది. దీనికి తోడు వ్యక్తిగత భద్రతా సిబ్బంది నిత్యం అక్షయ్ కుమార్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
ఒకప్పుడు వరుస హిట్స్‌తో అక్షయ్ కుమార్ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. ప్రస్తుతం భూత్ బంగ్లా, వెల్‌కమ్ టూ ది జంగీల్, హైవాన్‌తో పాటు మరో సినిమాలో ఖిలాడీ నటిస్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











