‘100 మందికి టార్గెట్‌గా ఆ యువ హీరో .. తొక్కేయడానికి పెద్ద ఫ్యామిలీలన్నీ సిండికేట్‌గా’
సినీ వినీలాకాశంలో వెలిగిపోవాలని ఎంతోమంది యువతీ యువకులు చెన్నై, ముంబై, హైదరాబాద్ రైలెక్కేస్తూ ఉంటారు. ముక్కూ ముఖం తెలియని ఊరులో బతకం కష్టమైనా సరే వారి సినిమా పిచ్చి కుదురుగా కూర్చోనివ్వదు. తీరా బండి దిగితే కానీ ఇక్కడి కష్టాలు తెలియవు. అవకాశాలు ఇచ్చేవారు.. దొరక్క ఛాన్సుల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవారు ఎందరో. అవకాశాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి అమ్మాయిల జీవితాలను నాశనం చేసినవారికి లెక్కేలేదు. నానాకష్టాలు పడి సినీ పరిశ్రమలో నెట్టుకొస్తుంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ఇండస్ట్రీ రాజకీయాలకు బలైనవారు మరికొందరు.
నెపోటిజం దెబ్బకు బలవుతున్న వర్ధమాన నటులు
టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో బలంగా ఉన్న నెపోటిజం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటికే ఇండస్ట్రీలో పాతుకుపోయిన పెద్ద మనుషులు తమ వారసులకు ఎదురు లేకుండా చేయడానికి వేసే ఎత్తుగడలకు తట్టుకుని నిలబడాలి. అలా పెద్దల ఆగ్రహానికి బలైన వర్ధమాన తారలెందరో. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఇండస్ట్రీలో నెపోటిజం ఏ స్థాయిలో ఉందో బయటకు వచ్చింది. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వృద్దిలోకి వస్తున్న దశలో ఎవరు ఎటు నుంచి ఎలాంటి దెబ్బ కొడతాడో తెలియక తమ జీవితాలను మధ్యలోనే తీసేసుకుంటున్నారు.

గాడ్ ఫాదర్ లేకుండా స్టార్‌గా
ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు ఎదుగుతుంటే దెబ్బ కొట్టేవారు ఖచ్చితంగా ఉంటాయని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. తాజాగా బాలీవుడ్‌లో మరో యువహీరోని తొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు అమల్ మాలిక్. ఆ యంగ్ హీరో ఎవరో కాదు కార్తీక్ ఆర్యన్. గాడ్ ఫాదర్ లేకుండా కేవలం తన కృషి, పట్టుదల, ప్రతిభతో స్టార్ హీరోగా ఎదిగారు ఆర్యన్. 2011లో ప్యార్ కే పంచనామా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. సిల్ వత్చ, సోనుకీ టిటుకీ స్వీటీ, లుకా చప్పి, పతి పత్నీ ఔర్ ఓ, లవ్ ఆజ్ కాల్, ధమాకా, భూల్ భూలయ్యా 2 వంటి సినిమాలతో యూత్ ఐకాన్‌గా మారారు. ప్రస్తుతం రెండు సినిమాలలో కార్తీక్ ఆర్యన్ నటిస్తుండగా.. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.
ప్రాణాలు తీసుకున్న సుశాంత్ రాజ్‌పుత్
బాలీవుడ్‌లో నెక్ట్స్ జనరేషన్ సూపర్‌స్టార్‌గా కార్తీక్ ఆర్యన్‌ను విమర్శకులు చెబుతున్నారు. ఈ స్టార్‌డమ్ ఆయనకు చేటు చేస్తుందని అంటున్నారు అమల్ మాలిక్. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో చీకటి కోణాల గురించి బయటపెట్టారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఇండస్ట్రీలోని పరిస్ధితులు ఎదిరించలేకపోయారని మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని పరిస్ధితులు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని పేర్కొన్నారు.
100 మంది కలిసి ఒక్కడిపై
కార్తీక్ ఆర్యన్‌ను బాలీవుడ్ నుంచి బయటకు పంపేయడానికి, తొక్కేయడానికి దాదాపు 100 మందికి పైగా ప్రయత్నిస్తున్నారని అమల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోని బడా ఫ్యామిలీలకు చెందిన వారు, నిర్మాతలు, స్టార్ హీరోలు ఇలా ప్రముఖులంతా ఆ వంద మందిలో ఉన్నారని బాంబు పేల్చారు. అయితే కార్తీక్ వాటిని జయించుకుంటూ వస్తున్నాడని.. తల్లిదండ్రుల మద్ధతు ఆయనకు ఉందని అమల్ మాలిక్ అన్నారు. ప్రస్తుతం ఈ సింగర్ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశం కాగా.. కార్తీక్ ఆర్యన్‌ను తొక్కడానికి ప్రయత్నించిన వారెవరు అంటూ నెటిజన్లు, ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











