డెలివరీ తర్వాత మళ్లీ మొదలుపెడతా: క్లారిటీ ఇచ్చిన అనుష్క శర్మ
'రబ్ దే బనా ది జోడీ' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది అనుష్క శర్మ. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఆమె.. ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. అలా.. చాలా కాలం విజయపరంపరను కొనసాగించిన ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకుంది. ఆ తర్వాతా నటిగా కొనసాగింది. ఇక, ప్రస్తుతం గర్భవతిగా ఉన్న అనుష్క శర్మ ఆరోగ్య కారణాలతో సినిమాలకు దూరమైంది.
జనవరిలో తల్లి కాబోతున్న అనుష్క శర్మ.. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తుందా? లేదా? అన్న దానిపై బాలీవుడ్ వర్గాల్లో కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తన ఫ్యూచర్ ప్లాన్ గురించి ఆమె స్పందించింది. 'నేను బ్రతికున్నంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటాను. డెలివరీ అయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి అడుగు పెడతాను. తల్లి అయినంత మాత్రాన సినిమాలకు దూరమవ్వాలని లేదు కదా. సినిమాలు చేసుకుంటూనే కుటుంబాన్ని కూడా చూసుకోవాలని భావిస్తున్నా. నటిగానే నేను తృప్తిగా ఉంటాను' అని ఆమె చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా, ఈ మధ్య సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది అనుష్క శర్మ. నటిగా వెండితెరకు దూరంగా ఉన్నా.. నిర్మాతగా మారి కొన్ని చిత్రాలను నిర్మిస్తోంది. అలాగే, వెబ్ సిరీస్‌లకూ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక, హీరోయిన్‌గా చేయాల్సిన సినిమాలు చాలా రోజుల పాటు ఆపేయాల్సి వచ్చింది. వాస్తవానికి ఆమె.. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కబోతున్న 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే సినిమాలో నటించాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఆ మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు గర్భవతిగా ఉన్నందు వల్ల సినిమా ఆగిపోయింది.


Click it and Unblock the Notifications











