బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న షారుక్ ఖాన్ తనయుడు, నటుడిగా కాదట!
షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ త్వరలో బాలీవుడ్లో కరణ్ జోహార్ మూవీ ద్వారా ఆరంగ్రేటం చేయబోతున్నారు. అయితే ఆర్యన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చేది నటుడిగా కాదట. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఆర్యన్ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం.
కరణ్ జోహార్ ప్రస్తుతం తక్త్ అనే భారీ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కరణ్ జోహార్ వద్ద దర్శకత్వం శాఖలో ఆర్యన్ ఖాన్ పని చేయబోతున్నాడట. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా షారుక్ మాట్లాడుతూ.. ఆర్యన్ ఖాన్ యాక్టర్ అవ్వడం కంటే ఫిల్మ్ మేకర్ అయ్యేందుకే ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు.

''ఆర్యన్ ఫిల్మ్‌మేకర్, రైటింగ్ కోర్స్ చేస్తున్నాడు. సుహానా మాత్రం యాక్టర్ అవ్వాలనుకుంటోంది. ఆర్యన్ ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే మరో ఐదేళ్ల సమయం పడుతుంది. ఫిల్మ్ మేకింగ్ అనేది కేవలం లిటరల్‌గా నేర్చుకుంటే వచ్చేది కాదు. కోర్స్ పూర్తయిన తర్వాత కరణ్ జోహార్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేయాల్సి ఉంటుంది.'' అని షారుక్ గతంలో ఓ పత్రిక ఇంటర్వ్యూలో తెలిపారు.
తక్త్ చిత్రాన్ని భారీ తారాగణంతో కరణ్ జోహార్ రూపొందించబోతున్నారు. ఆర్యన్ ఖాన్ తన కెరీర్ మొదలు పెట్టడానికి ఇదే సరైన చిత్రం అని అంతా భావిస్తున్నారు. మొఘల్ చరిత్ర ఆధారంగా రూపొందబోయే ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అలియా భట్, విక్కీ కౌశల్, కరీనా కపూర్, అనిల్ కపూర్, భూమి పడ్నేకర్, జాహ్నవి కపూర్ తదితరులు నటిస్తున్నారు.
మరో వైపు యాక్టింగ్ వైపు రావాలనుకుంటున్న షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటోంది. థియేటర్ ప్లే(నాటకాలు) వేస్తూ మెళకువలు నేర్చుకుంటోంది. త్వరలోనే సుహానాను మనం తెరపై చూడబోతున్నాం.


Click it and Unblock the Notifications











