Batwara 1947 Trailer Review: బట్వారా 1947 ట్రైలర్ రివ్యూ!
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న చిత్రం బట్వారా 1947. స్వాతంత్ర ఉద్యమం, దేశ విభజన సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా చేసుకొని ఫిక్షనల్ స్టోరీగా ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి రూపొందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సన్నీడియోల్, ప్రీతీ జింటా జంటగా నటించారు. ఈ చిత్రంలో షబానా ఆజ్మీ, కరణ్ డియోల్, అభిమన్యు సింగ్, ఖుషీ హజారే, కనికా కపూర్ తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. డైలాగ్స్: రాజ్‌కుమార్ సంతోషి, అస్గర్, మ్యూజిక్: ఏఆర్ రెహ్మన్, లిరిక్స్: జావెద్ అఖ్తర్, సినిమాటోగ్రఫి: సంతోష్ శివన్, ఎడిటర్: సాల్లీ సల్గాంకర్, యాక్షన్: రవి వర్మ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమాను ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్దం చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? అమీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మించడం వెనుక కారణం ఏమిటి? సన్నీడియోల్, అమీర్ ఖాన్ ఈ సినిమా కోసం ఎలా చేతులు కలిపారనే విషయంలోకి వెళితే..

బట్వారా ట్రైలర్ విషయానికి వస్తే.. సినిమా దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత భారత్‌లో హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలు చోటు చేసుకొంటాయి. హిందువులపై ముస్లింల దాడులతో అలజడలు నెలకొంటాయి. హిందూ దేవాలయాలు, హిందువుల నివాసాలపై ముస్లింల దాడి చేయాలనే లక్ష్యంతో అల్లరి మూకలు పనిచేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సన్నీడియోల్, ప్రీతీ జింటా కుటుంబానికి కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. వాటిపై సన్నిడియోల్ ఎలా రియాక్ట్ అయ్యారు. హిందూ, ముస్లింల సమైక్యత కోసం ఎలాంటి పోరాటం చేశాడనేది ఈ సినిమాలోని ప్రధానమైన పాయింట్‌గా కనిపించింది.
ఈ చిత్రంలో సన్నిడియోల్ ముస్లింగా కనిపించబోతున్నాడనే సంకేతాలు ఇచ్చారు. ఇక షబానా ఆజ్మీ హిందూ మతానికి చెందిన వృద్ధురాలిగా కనిపించబోతున్నారు. షబానా ఆజ్మీ నివసించ ఇంటిని ముస్లింలు కబ్జా చేయాలని ప్రయత్నిస్తారు. కానీ సన్నిడియోల్ అడ్డుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ముస్లిం గ్రూపుల్లో విభేదాలకు దారి తీస్తాయి. దాంతో హిందువులపై దాడి చేయడం ఇస్లాం మత ఉద్దేశం కాదనే పాయింట్‌ను ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. దేశ విభజన సమయంలో భారత్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే సన్నివేశాలను కూడా రాజ్ కుమార్ సంతోషి భావోద్వేగంగా తెరకెక్కించారనే విషయం ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు.
ఇక ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్లందరూ తమ పాత్రల్లో జీవించినట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో సన్నీడియోల్‌కు కుమారుడిగా ఆయన సొంత కొడుకు కరణ్ డియోల్ నటించాడు. ఈ చిత్ర ట్రైలర్‌లో కరణ్ డియోల్ చప్పిన డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. తన తండ్రి సన్నిడియోల్ ఇమేజ్, స్టామినాను తెలియజెప్పే విధంగా కరణ్ చేత దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి డైలాగ్స్ చెప్పించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సన్నిడియోల్ మరోసారి తెరపైన విశ్వరూపం చూపించబోతున్నారు. సినిమా మొత్తం తన పాత్ర చుట్టే తిరిగే విధంగా షబానా ఆజ్మీ క్యారెక్టర్ ఉండబోతుంది. అభిమన్యు సింగ్, ఫజల్ అలీ అందరూ ఇంపాక్ట్‌ఫుల్ రోల్‌లో కనిపించారు.
విభిన్నమైన చిత్రాలను రూపొందించే అమీర్ ఖాన్ మరో మంచి కథతో బట్వారా 1947 చిత్రం ద్వారా రాబోతున్నారు. తన స్నేహితులు రాజ్ కుమార్ సంతోషి, సన్నీడియోల్‌తో ఇంటెన్స్, దేశభక్తితో కూడిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేలా చేసింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది అనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications