ఇన్‌స్టాలో 56 లక్షల మంది ఫాలోవర్స్ .. ఓట్లు చూస్తే , బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కి దెబ్బేసిన ఓటర్లు
నలుగురితో టచ్ ఉండటానికి , మన అభిప్రాయాలు పంచుకోవడానికి అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా ఎన్నో మంచి పనుల్లో పాలు పంచుకుంది. ప్రజా పోరాటాలు, ఉద్యమాలకు బాసటగా నిలిచింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ అనే కొత్త పదం పుట్టుకొచ్చి వీరు సెలబ్రెటీలుగా చలామణి అవుతున్నారు. టాలెంట్ ఉండి దానిని ఎలా బయటపెట్టాలో తెలియని ఎంతోమందికి సోషల్ మీడియా వేదికగా నిలిచింది. హీరో హీరోయిన్లుగా, డ్యాన్సర్స్‌గా, డైరెక్టర్‌గా ఎందరో అవకాశాలు అందుకున్నారు. ఈ కోవలో కొందరు రాజకీయ నాయకులుగానూ మారారు. అలా పొలిటీషియన్ కావాలని అనుకున్న ఓ నటుడికి జనం షాకిచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర , ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి విజయం సాధించింది. ఎన్టీయే కూటమి 232 స్థానాల్లో, కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ 47 స్థానాల్లో విజయం సాధించాయి. శివసేన, ఎన్సీపీలలో తిరుగుబాటు వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో.. ప్రజలు ఈ చీలికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది. అయితే ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్‌లకు షాకిస్తూ మహాయుతినే జనం గెలిపించారు.

ఓబీసీలు, ప్రజాకర్షక పథకాలు, మహిళలు, రైతులు మహాయుతి వైపు నిలబడటంతో మహా వికాస్ అఘాడి దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కీలకమైన విదర్భ ప్రాంతంలో మహాయుతి గాలి బలంగా వీచింది. దాదాపు 11 జిల్లాలున్న ఏ ప్రాంతంలో 62 అసెంబ్లీ స్థానాలకు గాను 40 చోట్ల మహాయుతి గెలుపొందింది. ఆర్ఎస్ఎస్ కూడా ఈ ప్రాంతంలో బీజేపీ కూటమి గెలవడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇతర బీజేపీ పెద్దల ప్రచారంతో పాటు సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌ల వ్యూహాలు మహాయుతికి బాగా ఉపకరించాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు రాగా.. సీఎం ఎవర్నది చర్చనీయాంశమైంది. బీజేపీ భారీగా స్థానాలు గెలవడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ నిర్ణయానికి షిండే, పవార్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

ఇదిలాఉండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు సైతం పోటీ చేయగా వీరిలో కొందరు గెలిచారు, మరికొందరు ఓటమి పాలయ్యారు. ఇక సినీనటుడు అజాజ్ ఖాన్ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలయ్యారు. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్సీరామ్) టికెట్‌పై వెర్సోవా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజాజ్ ఖాన్‌కు కేవలం 155 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఈయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 56 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. ఇంత దారుణ ఓటమితో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అజాజ్ ఖాన్ తెలుగులో దూకుడు, బాద్ షా, హార్ట్ ఎటాక్, టెంపర్ సినిమాలతో అలరించారు. అలాగే హిందీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గానూ వ్యవహరించారు. అన్నట్లు వెర్సోవాలో శివసేన (యూబీటీ) అభ్యర్ధి హరూన్ ఖాన్ విజయం సాధించారు.


Click it and Unblock the Notifications











