కంగనా మూవీకి లైన్ క్లియర్.. ఆ కండీషన్ మీదే , బాలీవుడ్ క్వీన్‌కు మరో పరీక్ష !!
యథార్ధ సంఘటనలు, బయోపిక్స్‌కు ఆదరణ పెరుగుతుండటంతో టాలీవుడ్ టూ బాలీవుడ్ మేకర్స్ అదే సినిమాలు తీస్తున్నారు. అయితే వాస్తవ ఘటనలను సినిమాగా తీసేటప్పుడు కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ జోలికి వెళ్తుండటంతో ఆయా సినిమాలు చిక్కుల్లో పడుతున్నాయి. బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ మూవీ కూడా చిక్కుల్లో పడింది. దివంగత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జీవితంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించగా సెన్సార్ బోర్డ్ నుంచి అనుమతి లభించలేదు.
ఇందిర పాలనతో పాటు భారతదేశ చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచిన ఎమర్జెన్సీ చుట్టూ ఈ సినిమాను రూపొందించారు. కంగనా రనౌత్ స్వయంగా ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. మణికర్ణిక ఫిలింస్, జీ స్టూడియో బ్యానర్లపై కంగనా రనౌత్, జీ స్టూడియోస్, రేణు పిట్టిలు దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరీ, మిలింద్ సోమన్, సతీష్ కౌశీక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచింది. అయితే ఈ సినిమాలో 1980వ దశకంలో పంజాబ్‌లో రక్తపుటేరులు పారించిన ఖలిస్తాన్ ఉద్యమం, స్వర్ణదేవాలయంలో సిక్కు మిలిటెంట్లు నక్కడంతో వారిని ఏరిపారేయడానికి ఇందిర ఆపరేషన్ బ్లూస్టార్‌కు ఆదేశాలివ్వడం, బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం వంటి అత్యంత సున్నితమైన అంశాలను కంగన టచ్ చేశారు.
అయితే సిక్కుల మనోభావాలు దెబ్బతినేలా ఎమర్జెన్సీ మూవీలో సన్నివేశాలు ఉన్నాయంటూ సిక్కుల అత్యున్నత సంస్థ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. అంతేకాదు స్వయంగా కంగనను చంపేస్తామంటూ బెదిరింపులు సైతం వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమర్జెన్సీకి సెన్సార్ బోర్డ్ నుంచి అనుమతి లభించకపోవడంతో మూవీ రిలీజ్ ఆగిపోయింది. దీనిని కంగనా రనౌత్ సీరియస్‌గా తీసుకున్నారు.
తమ ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా సెన్సార్ బోర్డును ఆదేశించాలని ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడా కంగనకు ఊరట లభించలేదు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది, అయితే ఈ నెల 18 లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. సెప్టెంబర్ 6న విడుదలవ్వాల్సిన ఎమర్జెన్సీ వాయిదాపడటంతో కంగనా రనౌత్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. తన హృదయం భారంగా మారిందని, పరిస్ధితిని అర్ధం చేసుకున్న అభిమానులకు, ప్రేక్షకులకు థ్యాంక్స్ అంటూ కంగన పోస్ట్ పెట్టారు.

ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని లేదంలో కొత్తవి యాడ్ చేయాలని సూచించింది. బంగ్లా శరణార్ధి శిబిరంపై పాక్ సైనికులు దాడిచేసి మహిళలు, చిన్నారుల తలలు నరకడం, అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ వ్యాఖ్యలు, ఆపరేషన్ బ్లూస్టార్ ఫుటేజ్‌కి సంబంధించిన వివరాలు సమర్పించాలని సెన్సార్ బోర్డ్ కోరింది. మొత్తానికి తన ప్రయత్నాలు ఫలించి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ దక్కడంతో కంగనా హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఎమర్జెన్సీ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











