2016 Panama Papers leak: మరోసారి చిక్కుల్లో పడిన ఐశ్వర్యరాయ్.. ఈడీ సమన్లు
2016లో జరిగిన 'పనామా పేపర్స్' గ్లోబల్ టాక్స్ లీక్ కేసులో మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఐశ్వర్యకు సమన్లు జారీ చేసింది. విదేశాలలో డబ్బు దాచిపెట్టిన ఆరోపణలపై మాజీ విశ్వ సుందరి ఇదివరకే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే చాలామంది ప్రముఖులను ఈడీ విచారించింది. ఇక అందరూ కూడా చట్టానికి లోబడి విచారణకు హాజరయ్యారు. ఇక ఐశ్వర్యారాయ్ కు గతంలోనే సమన్లు జారీ చేయగా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. తాజా విచారణ విషయంలో ఏం జరిగిందంటే..

ఈడీ విచారణకు హాజరవ్వాలని
ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కోడలలై ఐశ్వర్యారాయ్ బచ్చన్ ను మరోసారి విచారించాలని దర్యాప్తు సంస్థ చర్యలు తీసుకోబోతోంది. ఈరోజు (డిసెంబర్ 20) ఢిల్లీలోని తమ కార్యాలయం ముందు హాజరుకావాలని నటిని ఏజెన్సీ కోరడంతో ఒక్కసారిగా ఈ వార్త నేషనల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఈడీ విచారణకు హాజరవ్వాలని తెలిపింది.

15 రోజుల్లో..
అయితే ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ఐశ్వర్య రాయ్ బచ్చన్ విచారణ కోసం మరొక తేదీని కోరినట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ నటి ముంబైలో ఉండగా అక్కడికే సమన్లు పంపినట్లు సమాచారం. ఇక ఈ విషయంలో ఆమె 15 రోజుల్లోగా స్పందించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఇక ఇప్పటివరకు ఆ విషయంలో ఐశ్వర్యారాయ్ ఏ విదంగా స్పందించలేదని తెలుస్తోంది.

మనీ-లాండరింగ్ కేసు
ఇంతకు ముందే.. పనామా పేపర్స్ కేసులో విచారణ కోసం ఐశ్వర్య రాయ్ కు రెండు సార్లు విచారణకు హాజరవ్వాలని ఈడి కోరింది. కానీ ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఐశ్వర్యారాయ్ పై 2002 (PMLA) కింద మనీ-లాండరింగ్ కేసును నమోదు చేసింది. ఇక ఫైనల్ గా ఆమెకు ఇచ్చిన డేట్ లోగా విచారణలో చేరాల్సిందిగా ఐశ్వర్యకు సమన్లు అందినట్లు ఈడీ ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు.

అమితాబ్ బచ్చన్ పేరు కూడా
పనామా పేపర్స్ కేసులో ఐశ్వర్యరాయ్ బచ్చన్‌తో పాటు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేరు కూడా ఉంది. 2017 సంవత్సరంలో, అమితాబ్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి తమ ఆర్థిక లావాదేవీల పత్రాలను సమర్పించారు. అంతేకాకుండా మరికొందరు బడా ఫిల్మ్ స్టార్స్ పేర్లు కూడా వార్తల్లోకి వస్తున్నాయి. కానీ ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు.

పన్ను ఎగవేసేందుకు మార్గంగా..
పనామా పేపర్స్ లీక్ కేసు విషయం అనేది ప్రతీ ఏడాది కూడా వార్తల్లో హైలెట్ అవుతూనే ఉంది. కానీ ఈ విషయంలో ఉన్న లింకులపై ఎలాంటి క్లారిటీ రాలేదు. పన్ను ఎగవేసేందుకు మార్గంగా కొందరు విదేశి బ్యాంక్ లో డబ్బును సేవ్ చేసుకుంటున్నారనేది ఈ కేసులో అసలు ఆరోపణ. కేవలం ఫిల్మ్ స్టార్స్ మాత్రమే కాకుండా ఇండియాలో వేలాది మంది ప్రముఖులు విదేశి బ్యాంక్ లలో కోటాను కోట్ల సంపదను దాచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











