డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత భార్య అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం.. సిని పరిశ్రమలో కలకలం
బాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ మాఫియాతో సినీ తారల లింకులు బయటపడటం కలకలం రేపింది. ప్రముఖ నిర్మాత ఇంటిలో నార్కోటిక్ డ్రగ్స్ అధికారులు దాడులతో హిందీ సినీ పరిశ్రమ మళ్లీ ఉలిక్కి పడింది. డ్రగ్స్ సప్లయర్ల విచారణ సందర్బంగా బయటకు వచ్చిన సమాచారంతో ఎన్సీబీ అధికారులు మళ్లీ దాడులు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్న అధికారులు.. ప్రముఖ నిర్మాత భార్యను అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సుశాంత్ మరణం తర్వాత
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత డ్రగ్స్ మాఫియాతో లింకుల వ్యవహారం బాలీవుడ్‌లో వెలుగు చూసింది. దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్లకు సమన్లు జారీ చేసి విచారించారు. అంతేకాకుండా రియా చక్రవర్తిని అంతకుముందే అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు.

నిర్మాత ఫిరోజ్ నడియాద్‌వాలా నివాసంలో దాడులు
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నడియాద్‌వాలా ఇంటిలో ఆదివారం మెరుపుదాడులు నిర్వహించారు. ఆ ఇంటిలో జరిపిన సోదాల్లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు. ఫిరోజ్ నడియాద్‌వాలా భార్య షబానా సయీద్ అరెస్ట్‌ను ఎన్సీబీ ధృవీకరించింది. ఎన్‌డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం అరెస్ట్ చేసినట్టు అధికారులు ప్రకటించారు.

భారీగా డ్రగ్స్ స్వాధీనం
షబానా సయీద్ అరెస్ట్ గురించి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే వెల్లడించిన ప్రకారం.. కొందరు డ్రగ్స్ సప్లయిదారులను విచారించగా నిర్మాత ఫిరోజ్ నడియాద్‌వాలా పేరు బయటకు వచ్చింది. వారి ఇంటిలో సోదాలు జరిపిన తర్వాత 727.1 గ్రాముల గంజాయి, 74.1 గ్రాముల చరస్, 95.1 గ్రాముల ఎండీని స్వాధీనం చేసుకొన్నాం. అంతేకాకుండా వారి వద్ద నుంచి 3,58,610 రూపాయలు సీజ్ చేశాం. ఈ వ్యవహారంలో ఐదుగురిని అరెస్ట్ చేశాం అని తెలిపారు
Recommended Video

గతంలో ఫిరోజ్ నడియాద్‌వాలా అరెస్ట్
ఫిరోజ్ నడియాద్‌వాలా నిర్మాతగా బాలీవుడ్‌లో పలు సినిమాలు నిర్మించారు. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్‌వాలాకు అత్యంత సమీప బంధువు. గతంలో హెరా పెరీ, అవారా పాగల్ దీవానా, వెల్‌కమ్, ఆరక్షన్ లాంటి సినిమాలను ఫిరోజ్ నిర్మించారు. పన్ను ఎగవేత కేసులో అరెస్ట్ అయి మూడు నెలలపాటు జైలుశిక్ష అనుభవించాడు.


Click it and Unblock the Notifications











