వరుసగా 16 ఫ్లాపులు .. వందల కోట్ల నష్టం, వాళ్ల వల్లేనంటూ స్టారో హీరో కామెంట్స్
ఈ ప్రపంచం విజేతలను మాత్రమే గుర్తుపెట్టుకుంటుందని పెద్దలు అంటూ ఉంటారు. మిగిలిన రంగాల సంగతి ఏమో కానీ సినీ రంగం మాత్రం సక్సెస్ వెంటే పరుగులు తీస్తుందన్నది కాదనలేని వాస్తవం. ఎన్ని హిట్ సినిమాలలో నటించినా.. దర్శక నిర్మాతలకు కనక వర్షం కురిపించినా.. ఒక్క ఫ్లాప్ రాగానే మహామహులు అన్న వారే అడ్రస్ లేకుండా పోయారు. పూలు పడిన చోటే రాళ్లు పడతాయి.. జేజేలు అందుకున్న చోటే అవమానాలు ఛీత్కారాలు ఎదురవుతాయి. ఫ్లాప్స్ ఇచ్చే దర్శకులు, హీరోలు, హీరోయిన్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. అలాంటి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16 వరుసగా ఫ్లాప్స్ ఎదురైతే సదరు నటీనటుల కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లే.
బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్‌కు పాపం ఈ మధ్య టైం అస్సలు బాలేదు. తను నటించిన సినిమాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. ఓ హీరో చేసే సినిమాలు వరుసగా ఫట్ అవుతుంటే అతని డేట్స్ తీసుకోవాలంటే దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తుంటారు. కానీ అక్షయ్ కుమార్ ఇన్ని ఫ్లాపులు ఇచ్చినా ఆయన కెరీర్ మాత్రం అందుకు భిన్నంగా నడుస్తోంది.

2020 నుంచి 2024 వరకు నాలుగేళ్ల సమయంలో అక్షయ్ కుమార్ చేసిన 16 సినిమాలు ఫ్లాప్ కావడమే కాక నిర్మాతలకు రూ.వందల కోట్లలో నష్టాలను మిగిల్చాయి. అవి బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్, రామ్ సేతు, సెల్ఫీ, టస్హాన్, కంబఖ్త్ ఇష్క్, జోకర్, లక్ష్మీ, కట్‌పట్లీ, బాస్, చాందినీ చౌక్ టు చైనా, బ్లూ, బ్రదర్స్, 8 x 10 తస్వీర్, ది షౌకీన్స్. అయినప్పటికీ నిర్మాతలు అక్షయ్‌తో సినిమాలు నిర్మించేందుకు క్యూకడుతున్నారు. ప్రస్తుతం అక్షయ్ హీరోగా నటిస్తున్న 10 సినిమాలు సెట్స్‌పై ఉన్నాయంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
వరుస ఫ్లాప్స్‌తో అక్షయ్ కుమార్ తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారు. తరచుగా తన సినిమాలు ఫ్లాప్స్ కావడంపై పలు ఇంటర్వ్యూలలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా చిత్ర పరిశ్రమలో సినిమాలు విజయం సాధించకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీల వల్లే బాక్సాఫీస్ వద్ద సినిమాలు సరిగా ఆడటం లేదని.. ఏం జరిగినా సరే తాము ఓటీటీలలోనే సినిమాలు చూస్తామని అంటున్నారని అక్షయ్ కుమార్ చెప్పారు.

సినిమాల కథలు, స్క్రిప్ట్ విషయంలో కోవిడ్‌కు ముందు, ఆ తర్వాత అనేలా పరిస్ధితులు చోటు చేసుకున్నాయని .. ఎలాంటి సినిమాలను ఆదరించాలనే దానిపై ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చిందని అక్షయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అలాంటి కంటెంట్‌పై తాను కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నానని.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే తరహా కథలనే తాను ఎంచుకుంటున్నానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఖిలాడీ హీరో తెలుగులో కన్నప్ప చిత్రంతో పాటు స్త్రీ 3 సినిమాలలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











