కంటినిండా నిద్ర లేదు .. జైలే బెటర్, సల్మాన్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్
మనిషి ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా మంచి ఆరోగ్యం, 8 గంటల సుఖమైన నిద్ర , మనశ్శాంతి లేకపోతే ఎన్ని ఉన్నా వేస్టే. డబ్బుంటే అన్నీ వచ్చేస్తాయని అందరూ అనుకుంటారు.. కానీ ప్రపంచ కుబేరుడికైనా కష్టాలు ఉంటాయి. దేశాన్ని ఏలే అధ్యక్షులు, ప్రధానులకు కూడా కష్టాలు ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కొని నిలబడిన వాళ్లే జీవితాన్ని గెలుస్తారు. తాజాగా కోట్లాది మంది అభిమానులు, వందల కోట్ల ఆస్తులు ఉన్న సల్మాన్ ఖాన్ కూడా జీవితంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దాదాపు 3 దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్రవేశారు సల్మాన్ ఖాన్. 1965 డిసెంబర్ 27న బాలీవుడ్ స్క్రీన్ రైటర్ సలీంఖాన్- సుశీల చారక్ దంపతులకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు సల్మాన్ ఖాన్. ఆయన పూర్తి పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. తల్లిదండ్రులు హిందూ - ముస్లింలకు చెందిన వారు కావడంతో ఆయన రెండు మతాలను పాటిస్తారు.

1988లో ఫలాక్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సల్మాన్ ఖాన్ ఆ తర్వాత చిన్నాచితకా పాత్రలతో హీరో స్థాయికి చేరారు. మైనే ప్యార్ కియా, సనమ్ బేవాఫా, సాజన్ చిత్రాలతో యువతలో తిరుగులేని స్థార్ డమ్ సంపాదించిన ఆయన హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్‌స్టార్ స్థాయికి చేరుకున్నారు. 50 ప్లస్‌లోనూ నేటికీ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సికందర్ అనే సినిమా చేస్తున్నారు సల్లూ భాయ్. ఇందులో కండల వీరుడి సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయన ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. కృష్ణ జింకల వేట, హిట్ అండ్ రన్ కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఇక తాము దైవంలా ఆరాధించే కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్‌ను చంపేస్తామని కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో సల్మాన్ ఖాన్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇక ఇన్నేళ్ల కెరీర్‌లో సల్మాన్ ఖాన్ కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 3000 కోట్ల పై మాటే.
అలాంటి సల్మాన్‌ఖాన్ తనకు నిద్రపట్టడం లేదని షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రోజుకు రెండు గంటలు మాత్రమే నేను నిద్రపోతానని.. నెలకోసారి 8 గంటలు పడుకుంటానని తెలిపారు. షూటింగ్‌లు లేనప్పుడు , ఖాళీగా ఉన్నప్పుడు నా ఇష్టమొచ్చినంత సేపు పడుకుంటానని , జైల్లో ఉన్న రోజుల్లో హాయిగా 8 గంటలు నిద్రపోయినట్లు సల్మాన్ ఖాన్ గుర్తుచేసుకున్నారు. ఇక విమానంలో ప్రయాణిస్తుండగా ఏదైనా సమస్య వచ్చి అందరూ కంగారుపడుతుంటే నేను మాత్రం హాయిగా పడుకుంటానని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











