300 కోట్ల ప్యాలెస్ .. 8000 కోట్ల ఆస్తులు, అయినా అద్దె ఇంట్లోనే స్టార్ హీరో..!
పాన్ ఇండియా సినిమాలతో దక్షిణాది చిత్రాలు హిందీ ఇండస్ట్రీని వణికిస్తున్నా మనదేశంలోనూ.. ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్‌కు ఉన్న గ్లామర్ , మార్కెట్ రేంజ్ మరే ఇండస్ట్రీకి లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి బాలీవుడ్‌ను దశాబ్ధాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్, కింగ్ ఆఫ్ రొమాన్స్, ఎస్ఆర్‌కే పేరు ఏదైనా సరే షారుఖ్ తన జైత్రయాత్రను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు.
సినిమాలు చేయడంలోనే కాదు, వ్యాపారాలు, సంపద విషయంలోనూ ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో షారుఖ్ దరిదాపుల్లోకి ఏ హీరో కూడా రాలేడు. అయితే ఇంతటి స్టార్‌డమ్, పేరు ప్రఖ్యాతులు ఆయనకి రాత్రికి రాత్రే రాలేదు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, ఛాన్సుల కోసం చిత్ర నిర్మాణ సంస్థల చుట్టూ తిరిగిన రోజులు ఎన్నో. తలదాచుకోవడానికి నీడ లేక బీచ్‌లో పడుకున్న రోజులూ ఉన్నాయి. పూట గడవటం కోసం పలు సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్ర కూడా వేశాడు షారుఖ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సెకండ్ హీరోగా, విలన్‌గా .. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా నేడు ఈ స్థాయికి చేరుకున్నారు.

ఆదిత్య చోప్రా దర్శకత్వంలో కాజోల్‌తో కలిసి నటించిన దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే షారుఖ్ ఖాన్ నట జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆయనకు వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో బాలీవుడ్‌కి, భారతీయ చిత్ర పరిశ్రమకు ఐకాన్‌గా మారారు షారుఖ్. పాన్ ఇండియా దెబ్బకి బాలీవుడ్ ప్రభ కోల్పోతున్న సమయంలో జవాన్, పఠాన్ వంటి చిత్రాలతో హిందీ ఇండస్ట్రీని నిలబెట్టారు షారుఖ్ . 60కి దగ్గరవుతున్నా నేటికీ అదే ఎనర్జీతో కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నారు ఖాన్. గౌరీని ప్రేమించి పెళ్లాడిన ఆయన తన ఇంట్లో హిందూ, ముస్లిం ఆచారాలను, పండుగలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
దాదాపు మూడున్నర దశాబ్థాలుగా ఇండస్ట్రీలో ఉన్న షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ దాదాపు రూ.8 వేల కోట్ల పైమాటే. భారతీయ చిత్ర పరిశ్రమలోని అత్యంత సంపన్నుల్లో ఆయన కూడా ఒకరు. సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, వ్యాపారాలు, ఐపీఎల్ వంటి వాటి ద్వారా షారుఖ్ ఖాన్ ఏడాదికి రూ.400 కోట్ల వరకు సంపాదిస్తారని అంచనా. ఇక ఆయన నివసించే విలాసవంతమైన మన్నత్ .. దేశంలోని ఖరీదైన ఇళ్లలో ఒకటి. దీని విలువే దాదాపు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఇన్ని వేల కోట్ల ఆస్తులకు యజమాని అయిన షారుఖ్ ఖాన్ రెండు ఇళ్లను అద్దెకు తీసుకున్నారే వార్త బాలీవుడ్‌ను షేక్ చేసింది. ముంబైలోని పాలి హిల్ ఏరియాలోని రెండు డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లను ఆయన అద్దెకు తీసుకున్నారట. వీటికి నెలకు రూ. 24.15 లక్షల చొప్పున ఏడాదికి రూ.2.9 కోట్ల అద్దె చెల్లిస్తున్నట్లు ఓ రియాలిటీ సంస్థ వెల్లడించింది. వీటిని బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ, ఆయన సోదరి దీప్సికా దేశ్‌ముఖ్ వద్ద నుంచి అద్దెకు తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే షారుఖ్‌కు అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన తలచుకుంటే క్షణాల్లో భవనాలను కొనగలరు? కదా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











