కరోనా పట్ల నిర్లక్ష్యం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం.. కనికా కపూర్‌పై కేసు నమోదు
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. అందరూ జాగ్రత్త వహించాలని ప్రభుత్వాలు ప్రజలను కోరుతోంది. ప్రభుత్వాలెన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగానే ప్రవర్తిస్తున్నారు. కరోనాను లైట్ తీసుకుని.. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా కనికా కపూర్ ఉదంతం దేశాన్నికుదిపేస్తోంది. ఆమెను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం.

దొంగచాటుగా తప్పించుకుని..
గత ఆదివారం లండన్ నుంచి వచ్చిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్.. ఎయిర్ పోర్ట్‌లో కళ్లుగప్పి తప్పించుకుంది. కరోనా టెస్ట్‌లు చేయించుకోకుండా వెళ్లిన కనికా.. ఆపై మూడు పార్టీల్లో పాల్గొంది. అయితే ఇదంతా జరిగిన నాలుగు రోజులకు ఓ బాంబ్ పేల్చింది.

పాజిటివ్ అని తేలింది..
తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని చావు కబురు చల్లగా చెప్పింది కనికా కపూర్. ఈ విషయం తెలిసిన ఎంతో మంది ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎందుకంటే అంతకుముందు ఆమె పాల్గొన్న మూడు పెద్ద పార్టీల్లో ఎంతో మంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

మాజీ సీఎం, మంత్రులు..
కనికా పాల్గొన్న పార్టీలో మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు ఎంపీ దుష్యంత్ సింగ్ వంటి వారు పాల్గొన్నారు. అనంతరం దుష్యంత్ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. ఇలా అక్కడి నుంచి ఈ వైరస్ ఎంత మందికి పాకిందో తెలియక వారంతా.. స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. కనికా నిర్లక్ష్యపు చర్యలకు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Recommended Video

కనికాపై కేసులు..
ప్రజల ఆరోగ్యంతో, ప్రాణాలతో చెలగాటం ఆడిన కనికాపై కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతక వ్యాధిని వ్యాప్తి చేసినందుకు గానూ ఆమెపై కేసుల నమోదవుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఆమెకు కనిష్టంగా ఆరు నెలలు, గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్ష పడే అవకాశముందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











