సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు క్లోజ్.. హత్యా? ఆత్మహత్యా?.. సీబీఐ ఏం తేల్చిందంటే?
భారతీయ సినీ రంగాన్ని కుదిపేసిన బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన ఎలా మరణించారు? ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అంటూ సుశాంత్ కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ మాజీ ప్రియురాలు , బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఆమె కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఈ కేసులో వినిపించాయి. ఇంతటి ప్రాధాన్యత గల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదికను కోర్టుకు సమర్పించింది.
ఖాన్‌లు, కపూర్‌లు తదితర హేమాహేమీలు ఉన్న బాలీవుడ్‌లో స్వయంకృష్టితో స్టార్‌గా ఎదిగారు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. వరుస హిట్స్‌తో ఊపు మీదున్న ఈ యువనటుడు నటనతో పాటు వ్యక్తిత్వంతోనూ ఎంతోమందికి ఫేవరెట్‌గా నిలిచారు. బాలీవుడ్ తర్వాతి తరం సూపర్‌స్టార్‌గా మన్ననలు అందుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న ముంబైలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. ఆయన మరణవార్త భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేసింది.

సెలబ్రెటీ కావడంతో పాటు పలు అనుమానాలు రేకెత్తడంతో వెంటనే ముంబై పోలీసులు, దర్యాప్తు బృందాలు ఆగమేఘాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యుల పేర్లు తెర మీదకు వచ్చాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని .. సుశాంత్ తల్లిదండ్రులు ఆరోపించారు. అలాగే సుశాంత్ అకౌంట్ నుంచి రియా కుటుంబ సభ్యులు రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని హీరో తండ్రి కేకే సింగ్ చేసిన ఆరోపణలు దిగ్భ్రాంతి కలిగించాయి. కేసులో ఆర్ధిక పరమైన అంశాలు ఉండటంతో ఏకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.
ఇదే కేసులో మాదక ద్రవ్యాల అంశం తెర మీదకు రావడం మరింత సంచలనం కలిగించింది. సుశాంత్‌కు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు మాదక ద్రవ్యాలు ఇచ్చేవారంటూ ఆరోపణలు వినిపించాయి. అనూహ్య మలుపుల నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కొన్నాళ్లు జైలులో కూడా ఉన్నారు. అనంతరం రియా, షోవిక్, వీరి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిలు విదేశాలకు వెళ్లకుండా సీబీఐ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై రియా కుటుంబ సభ్యులు బాంబే హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత ధర్మాసనం సమర్ధించింది.
దాదాపు నాలుగేళ్లకు పైగా సాగిన ఈ హైప్రొఫైల్ కేసులో సీబీఐ తాజాగా దర్యాప్తును క్లోజ్ చేసింది. ఈ మేరకు మార్చి 22న ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. రియాపై సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలపై ఒక కేసు, సుశాంత్ ఫ్యామిలీపై రియా చేసిన ఆరోపణలపై మరో కేసులోనూ సీబీఐ తన ఇన్వెస్టిగేషన్ ముగించింది. సుశాంత్ మరణం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ పేర్కొంది. అలాగే సుశాంత్ మరణంతో నటి రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చింది. మరి సీబీఐ నివేదికపై సుశాంత్ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











