భర్తపై స్టార్ హీరోయిన్ గృహ హింస కేసు... 50 కోట్లు నష్టపరిహారం కావాలంటూ
ఇటీవలి కాలంలో నటీనటుల విడాకుల వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడు ఏ సెలబ్రిటీ బాంబు పేలుస్తాడోనని సినీ పరిశ్రమ, అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ ఏడాది పలువురు నటీనటులు, ఇతర ప్రముఖులు తమ జీవిత భాగస్వాములతో విడిపోయారు. మరికొందరు ఇదే దారిలో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన భర్త.. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ గృహ హింస కేసు పెట్టింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏం జరిగింది? ఈ వివరాల్లోకి వెళితే..
మిస్ ఇండియా విజేతగా
బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొబైల్ ఫోన్ కంపెనీకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా కెరీర్ ప్రారంభించిన సెలీనా జైట్లీ ఆ తర్వాత మోడలింగ్‌లోకి దిగారు. 2001లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ గెలిచి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మిస్ మార్గో బ్యూటీఫుల్ స్కిన్ తదితర మోడలింగ్ పోటీలలో విజయం సాధించింది. 2001లో భారతదేశం తరపున మిస్ యూనివర్స్ పోటీలకు ప్రాతినిథ్యం వహించిన సెలీనా జైట్లీ.. ఫోర్త్ రన్నరప్‌గా నిలిచారు. అదే ఏడాది జాజీ బీ రూపొందించిన మ్యూజిక్ వీడియో ఓ కేహ్రీతో పాపులర్ అయ్యారు సెలీనా. అనంతరం బాంబే వికింగ్స్ మ్యూజిక్ వీడియోలలో అవకాశం దక్కించుకున్నారు.

ఆస్ట్రేలియా వ్యాపారవేత్తతో పెళ్లి
ఈ దశలో 2003లో ఫిరోజ్ ఖాన్ తెరకెక్కించిన జనషీన్ మూవీతో సినీరంగ ప్రవేశం చేశారు సెలీనా. అనంతరం నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్‌మాల్ రిటర్న్స్, థ్యాంక్యూ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను సెలీనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2012లో తొలుత కవల మగ పిల్లలు జన్మించారు. ఆ తర్వాత 2017లో మరోసారి కవల మగ పిల్లలు జన్మించగా.. వీరిలో ఓ చిన్నారి హృదయ సంబంధిత అనారోగ్యంతో కన్నుమూశాడు.
భర్తపై గృహ హింస కేసు
పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతల కారణంగా 2012లో చివరిసారిగా విల్ యూ మ్యారీ మీ అనే సినిమాలో నటించారు సెలీనా జైట్లీ. ఆ తర్వాత దాదాపు 8 ఏళ్ల పాటు సినీరంగానికి దూరంగా ఉన్న ఆమె.. 2020లో సీజన్స్ గ్రీటింగ్స్ అనే షార్ట్ ఫిలింలో నటించారు. కాగా.. గత కొంతకాలంగా భర్త పీటర్ హాగ్‌తో ఆమెకు మనస్పర్థలు చోటు చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చాయి. తాజాగా పీటర్ హాగ్‌పై సెలీనా గృహ హింస కేసు దాఖలు చేయడంతో బాలీవుడ్ షాకైంది. ఈ మేరకు నవంబర్ 21న ముంబై అంధేరీలోని మెట్రోపాలిటిన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త వల్ల కోల్పోయిన 50 కోట్ల రూపాయల ఆదాయాన్ని చెల్లించాలని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే తనకు నెలకు 10 లక్షల రూపాయల భరణం చెల్లించడంతో పాటు ముంబైలోని తన ఇంట్లోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు సెలీనా. తన భర్తతో ఉంటున్న ముగ్గురు పిల్లల బాధ్యత కూడా తనకే అప్పగించాలని పిటిషన్‌లో అభ్యర్ధించారు సెలీనా.
నా భర్త ఓ నార్సిసిస్ట్
పీటర్ హాగ్ ఓ నార్సిసిస్ట్, ఓ స్వార్ధపరుడని సెలీనా ఆరోపించారు. తనపైనా, పిల్లలపైనా ఆయనకు ఎలాంటి ప్రేమ లేదని.. పిల్లలు పుట్టాక తనను పనిచేయకుండా అడ్డంకులు సృష్టించాడని పేర్కొన్నారు. శారీరకంగా, మానసికంగా వేధింపుల కారణంగా తాను సైకోవెజిటేటివ్ ఓవర్‌లోడ్‌తో బాధపడుతున్నట్లు సెలీనా తెలిపారు. నా బిడ్డ, తల్లిదండ్రులు మరణించిన తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయని.. ముంబైలోని నా ఇంటిని రాసివ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆమె ఆరోపిచారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. డిసెంబర్ 12 లోపు కోర్టు ఎదుట హాజరుకావాలని హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో సెలీనా వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











