రావణుడిగా చిన్న నవాబు... ఆదిపురుష్ లో అతడే విలనట!!!!
ఆదిపురుషుడిగా ఆరుడుగల బాహుబలి సెట్ అయిపోయాడు. నిన్నటివరకూ ప్రభాస్ కు జోడీగా ఎవరు సెట్ అవుతారు అన్న డౌట్ కు కీర్తీ సురేశ్ రూపంలో క్లారిటీ వచ్చేసింది. మరి, రామాయణం అనగానే గుర్తుకువచ్చే రావణాసురిడి పాత్రను ఎవరు పోషించబోతున్నారు అన్న కొత్త డౌట్ వచ్చేసరికి, దానికి సరైన క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు చిత్ర యూనిట్.
ప్రభాస్ తో తలపడేందుకు భళ్లాళదేవుడి లాంటి సమఉజ్జీ అయితే సరిపోదు. అందంలోనూ, ఆహార్యంలోనూ, రాముడికి గట్టిపోటీ ఇచ్చే రావణుడి పాత్రకు ఆషామాషీ విలన్ కాకుండా, బాలీవుడ్ చోటే నవాబ్ ను దించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక- నిర్మాతలు.

చోటే నవాబ్ గా పేరుగాంచిన పటౌడీ కింగ్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే విభిన్నమైన పాత్రలు పోషించి బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్, గతంలో తెరకెక్కించిన తానాజీలో సైఫ్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక తాజా సినిమాలోనూ స్టైలిష్ రావణ్ గా కనిపించేందు సైఫ్ అయితేనే పర్ఫెక్ట్ అని చిత్ర బృందం భావిస్తోంది.
టీ-సిరీస్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్, 500కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా స్టార్ క్యాస్ట్ కూడా అంతే భారీగా ఉండేట్లు ప్లాన్ చేస్తున్నారు. మరి, సీతగా కీర్తీ సురేశ్, రావణుడిగా సైఫ్ సెట్ అయ్యాక ఇతర పాత్రలను కూడా త్వరలోనే రివీల్ చేస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











