స్టార్ హీరో అయితేనే ఓకే చెబుతారా .. లైవ్‌లో బుక్కయిన హీరోయిన్
ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకున్న అతికొద్దిమంది హీరోయిన్‌లలో పూజా హెగ్డే ఒకరు. తొలుత ఐరెన్ లెగ్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ వరుస హిట్ సినిమాలతో కోలీవుడ్‌లోనూ జెండా పాతింది. బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోవాలని భావించి ముంబైలో అడుగుపెట్టిన పూజా హెగ్డే కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది.
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసికా భాయ్ కిసి కి జాన్ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ దశలో టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాల నుంచి ఆమె తప్పుకోవడం కలకలం రేపింది. తెలుగులో అయితే పూజా హెగ్డేకు గతంలో మాదిరిగా ఏ ఆఫర్లు దొరకడం లేదు. ప్రస్తుతం హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా, తమిళ్‌లో సూర్య 44వ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు.

పూజా హెగ్డే హిందీలో నటించిన దేవా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో పావైల్ గులాటీ, ప్రవేశ్ రానా, గిరిష్ కులకర్ణి, మనీష్ వాద్వా తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిల్మ్స్ పతాకంపై సిద్ధార్ధ్ రాయ్ కపూర్, ఉమేశ్ కేఆర్ బన్సాల్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా.. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రిజల్ట్ వీకెండ్ తర్వాత కానీ బయటకు రాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా హీరో హీరోయిన్లు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనిలో భాగంగా షాహిద్ కపూర్, పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్ర హీరోల సినిమాలలో నటించడంపై పూజా హెగ్డేపై ప్రశ్నలు ఎదురవ్వగా ఆమె అసహనానికి గురయ్యారు. ఆ చిత్రాలలో నటించడానికి నేను అర్హురాలినే అని.. తనను ఎంపిక చేసుకోవడంపై దర్శక నిర్మాతలకు క్లారిటీ ఉంటుందని పూజా అన్నారు. నా అదృష్టం వల్లే నాకు ఈ అవకాశాలు వచ్చాయనుకుంటే.. నేను ఏమాత్రం బాధపడనని ఆమె తేల్చిచెప్పారు.

పూజా నుంచి ఇలాంటి ఆన్సర్ వచ్చినప్పటికీ ఓ జర్నలిస్ట్ మీరు స్టార్ హీరోల సినిమాలను మాత్రమే ఎంచుకుంటారా అంటూ ప్రశ్నించడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వరుస పెట్టి స్టార్ హీరోల చుట్టూనే ప్రశ్నలు రావడంతో అసలు మీ ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. దాంతో పక్కనే ఉన్న షాహిద్ కపూర్ జోక్యం చేసుకుని వాతావరణాన్ని చల్లబరిచారు. బహుశా నువ్వు యాక్ట్ చేసిన స్టార్ హీరోలంటే అతనికి ఇష్టం అనుకుంటా అంటూ పంచ్‌లు విసరడంతో అంతా నవ్వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











