ధర్మేంద్రని ఏరికోరి పెళ్లి... భర్తని హేమామాలిని ఎందుకు దూరం పెట్టిందంటే?
బాలీవుడ్ దిగ్గజ నటుడు, హీ మ్యాన్‌గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ధర్మేంద్ర ఇకలేరు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర నవంబర్ 24వ తేదీన కన్నుమూశారు. బాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోగా ఎన్నో రికార్డులు సృష్టించిన ఆయన నటుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా చెరగని ముద్ర వేశారు. అయితే విజయవంతంగా సాగిపోతున్న ఆయన కెరీర్‌లో డ్రీమ్ గర్ల్ హేమామాలినితో రెండో పెళ్లి అనేది మలుపుగా చెబుతారు విశ్లేషకులు. దీని కారణంగా ధర్మేంద్ర ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే..
డిసెంబర్ 8, 1935న పంజాబ్‌లోని నజ్రయిల్‌లో జన్మించారు ధరేంద్ర. ఆయన అసలు పేరు ధర్మేంద్ర కేవాల్ కృష్ణ డియోల్. తల్లిదండ్రులు కేవాల్ క్రిషన్, సత్వంత్ కౌర్. పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ధర్మేంద్రకు 1954లో ప్రకాష్ కౌర్‌తో వివాహం జరిగింది. ఈ దంపతులకు సన్నీ డియోలు, బాబీ డియోల్ సంతానం. 1960లో దిల్ భి తేరా హమ్ భీ తేరే సినిమాతో హేమాహేమీలున్న బాలీవుడ్‌లో ఓ సాదాసీదా నటుడిగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మేంద్రకు ఆ తర్వాత ఆయి మిలన్ కి బేలా, ఫూల్ ఔర్ పత్తర్, అయే దిన్ బాహార్ కే తదితర చిత్రాలు వెనుదిరిగి చూసుకోకుండా చేశాయి.

తన మాస్, యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రాలతో వరుస హిట్లు కొట్టి బాలీవుడ్ హీ మ్యాన్ అని పిలిపించుకున్నారు ధర్మేంద్ర. ఆరు దశాబ్ధాలకు పైగా కెరీర్‌లో 300కు పైగా సినిమాలలో నటించారు ధర్మేంద్ర. ఆయన నటించిన చిత్రాలలో 121 సినిమాలు ఘన విజయం సాధించాయి. ఈ ఘనత ఒక్క ధర్మేంద్రకే సొంతం. కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్, కోట్లాది రూపాయల ఆస్తులు, తీరిక లేని షెడ్యూల్స్‌తో సాగిపోతున్న దశలో హేమామాలిని రాక ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. రాజా జానీ, సీతా ఔర్ గీతా, షరాఫత్, నయా జమానా, పత్థర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, చరస్, షోలే, ఆజాద్, దోస్త్ తదితర సినిమాలలో ధర్మేంద్ర- హేమామాలిని కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లుగా హిందీ మీడియా కోడై కూసింది.
అప్పటికే ధర్మేంద్రకు పెళ్లయి పిల్లలు ఉండగా.. 1980లో హేమామాలిని మెడలో మూడు ముళ్లు వేశారు హీమ్యాన్. ఈ దంపతులకు ఈషా డియోల్, అహనా డియోల్ సంతానం. ధర్మేంద్రతో పెళ్లి, ఆ తర్వాత జీవితం గురించి తన జీవిత చరిత్ర హేమామాలిని: బియాండ్ ది డ్రీమ్ గర్ల్‌లో హేమామాలిని కీలక విషయాలు ప్రస్తావించారు. హేమ తల్లి జయ చక్రవర్తి.. ఒకప్పుడు ధర్మేంద్రకు బదులుగా జితేంద్రను పెళ్లి చేసుకోమని ఆమెపై ఒత్తిడి చేశారట. ధర్మేంద్రకు పెళ్లయి, నలుగురు పిల్లలకు తండ్రి కావడమే అందుకు కారణం.
అలాగే పెళ్లయిన తర్వాత ధర్మేంద్రతో తాను ఎందుకు ఒకే ఇంట్లో కలిసి జీవించలేదో కూడా హేమామాలిని వివరించారు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. ధర్మేంద్ర ఇప్పటికే ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ధరమ్ జీ.. నా కోసం, నా కుమార్తెల కోసం ఏం చేసినా నేను సంతోషంగానే ఉన్నానని హేమ రాసుకొచ్చారు. అసాధారణ పరిస్ధితులు ఉన్నప్పటికీ.. తాను ఒంటరిని అని హేమ భావించలేదు. నేను అతనిపై నిఘా ఉంచాల్సిన అవసరం లేదు.. తండ్రిగా ఆయనకు బాధ్యతలు తెలుసు అని ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఏ మహిళ ఇలా జీవించాలని అనుకోరు.. కానీ నేను దాని గురించి బాధపడటం లేదు. నా పిల్లలని బాగానే పెంచాను అని ఓ ఇంటర్వ్యూలో హేమామాలిని తెలిపారు. తన దృష్టంతా ఎల్లప్పుడూ తన కుమార్తెలు ఈషా, అహానాలపైనే ఉండేది. ధర్మేంద్ర రోజువారీ ఉనికి లేకపోయినా తల్లిగా అన్ని చక్కదిద్దారు హేమామాలిని. భార్యలు ప్రకాశ్ కౌర్, హేమామాలిని వారి పిల్లలతో కుటుంబ ఐక్యతను కాపాడుకుంటూ వచ్చారు ధర్మేంద్ర. ఇంతకాలం కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ 89 ఏళ్ల వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో డియోల్ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.


Click it and Unblock the Notifications











