Dharmendra: ధర్మేంద్ర ఆరోగ్యంపై క్లారిటీ .. సన్నీ డియోల్ కీలక ప్రకటన..
Dharmendra: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వ్యాపించిన రూమర్స్‌పై ఆయన కుటుంబం, టీమ్ స్పందించి పూర్తి స్పష్టతనిచ్చింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో "ధర్మేంద్ర గారు మరణించారు", "వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు" అనే తప్పుడు వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలతో అభిమానుల్లో ఆందోళన నెలకొనగా, కొంతమంది సినీ వర్గాలు కూడా తప్పు సమాచారాన్ని పంచుకున్నారు. అయితే తాజాగా ఆయన కుమారుడు, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ (Sunny Deol) స్వయంగా ముందుకొచ్చి ఈ వార్తలను ఖండించారు.
సన్నీ డియోల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ ప్రకటన విడుదల చేస్తూ, "నా తండ్రి ధర్మేంద్ర గారు ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన కేవలం సాధారణ పరీక్షల కోసం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ (Breach Candy Hospital) కి వెళ్లారు. శ్వాస సంబంధిత చిన్న అసౌకర్యం కారణంగా వైద్యులను సంప్రదించారు. దయచేసి ఎవ్వరూ తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు. మా కుటుంబ గోప్యతను గౌరవించండి" అని తెలిపారు. ఈ ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ధర్మేంద్ర టీమ్ కూడా జాతీయ మీడియాతో మాట్లాడుతూ, "ఆయన వెంటిలేటర్‌పై లేరు. కేవలం ఆబ్జర్వేషన్‌లో ఉన్నారు. ఆరోగ్యం స్థిరంగా ఉంది, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని వివరించింది. గత అక్టోబర్ 31న ఆయన స్వల్ప శ్వాస సమస్యతో ఆసుపత్రిని సందర్శించారు. సాధారణ పరీక్షల అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన ఆయన, ఈ మధ్య మరోసారి చెకప్ కోసం వెళ్లడంతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలైంది.
ధర్మేంద్ర గారు బాలీవుడ్‌లో ఆరు దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా వెలుగొందిన నటుడు. 1958లో ల్ బీ తేరా హామ్ బీ తేరే సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తరువాత 'షోలే', 'చుప్కే చుప్కే', ' ధర్మ్ వీర్', 'సీటా ఔర్ గీత', 'యాదోంకీ బారాత్' వంటి అనేక క్లాసిక్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పవర్ పుల్ డైలాగ్ డెలివరీ, స్టైల్, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయనను అభిమానులు 'హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్' అని ప్రేమగా పిలిచేవారు.
ఇప్పటికీ ఆయన సినిమాల్లో యాక్టివ్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం 'ఇక్కీస్ (Ikkis)' డిసెంబర్ 25న విడుదల కానుంది. పరమవీర చక్ర పురస్కార గ్రహీత లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ధర్మేంద్ర ఆయన తండ్రి పాత్రలో కనిపించనున్నారు. సన్నీ డియోల్ వివరణ తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని కోరుతూ సందేశాలు పంచుకుంటున్నారు.
పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనకు గెట్‌వెల్ విషెస్ తెలియజేశారు. ధర్మేంద్ర డిసెంబర్ 8న తన 90వ పుట్టినరోజును జరుపుకోనుండగా, అభిమానులు ఆయన శతాయుష్షుతో ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు.బాలీవుడ్‌కి బాటసారిగా నిలిచిన ఈ లెజెండరీ నటుడిపై వచ్చిన తప్పుడు వార్తలు మరోసారి సోషల్ మీడియా బాధ్యతారాహిత్యాన్ని చూపించాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











