దిశా పటానీ తండ్రికి దారుణంగా చీటింగ్ .. రంగంలోకి పోలీసులు
ఎంతో తెలివైన వాళ్లం అనుకునేవారు కూడా కొన్నిసార్లు మోసపోతుంటారు. కేటుగాళ్లు ఎంతగా తెలివి మీరుతున్నారంటే పోలీసులను కూడా అడ్డంగా బుక్ చేసేస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ దిశా పటాని తండ్రిని కొందరు వ్యక్తులు మోసం చేశారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.? ఆయన స్వయంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కావడం గమనార్హం. అలాంటి వ్యక్తిని కూడా బురిడీ కొట్టించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో స్ధిరపడ్డారు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కుటుంబం. ఆమె తండ్రి జగదీష్ పటానీ రిటైర్డ్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్. ఈ క్రమంలో ఓ వ్యక్తి ద్వారా దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాశ్ అనే వ్యక్తులు జగదీష్ పటానీకి పరిచయమయ్యారు. ఇక అప్పటి నుంచి వారు తమ నాటకాన్ని మొదలుపెట్టారు. తమకు రాజకీయంగా, ప్రభుత్వపరంగా పలుకుబడి ఉందని మాయమాటలు చెప్పారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న ఓ కమీషన్‌లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సహా ఏదో ఒక కీలక పదవిని మీకు వచ్చేలా చేస్తామని జగదీష్‌కు నూరిపోశారు. వీరి మాటలు నిజమేనని నమ్మిన దిశా పటానీ తండ్రి ఎంతో ఆశతో రూ.25 లక్షలను వారి ఇచ్చాడు. అయితే రోజులు గడుస్తున్నా వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అనుమానం వచ్చిన జగదీశ్.. వారిని నిలదీశారు.
ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కావడంతో భయపడినట్లుగా నటించిన నిందితులు మీ డబ్బును వడ్డీతో సహా కట్టేస్తామని చెప్పడంతో అప్పటికి జగదీశ్ శాంతించారు. తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. బెదిరింపులకు పాల్పడటంతో జగదీశ్ తాను మోసపోయినట్లుగా గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బరేలీ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులను శివేంద్ర ప్రతాప్ సింగ్, దివాకర్ గార్గ్, ఆచార్య జై ప్రకాష్ , ప్రీతి గార్గ్ మరో వ్యక్తిగా తెలుస్తోంది. దివాకర్ , ఆచార్యలను పరిచయం చేసింది శివేంద్రేనని జగదీశ్ పటానీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదిలాఉండగా జగదీష్ పటానీ కుమార్తె సినీ నటి దిశా పటానీ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు. వరుణ్ తేజ్ సరసన నటించిన లోఫర్ ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన ఆమె తర్వాత ఎంఎస్ ధోనీ బయోపిక్, కుంగ్ ఫూ యోగా, వెల్‌కమ్ న్యూయార్క్, భాఘీ, రాధే, యోధ, కల్కి 2898 ఏడీ, కంగువా వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. ప్రస్తుతం వెల్‌కమ్ టూ ద జంగల్ అనే చిత్రంలో దిశా పటానీ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











