బాలీవుడ్ హీరోలపై డ్రగ్ పంజా.. ఈడీ దూకుడుతో రియా ఉక్కిరి బిక్కిరి.. లాకర్ల స్వాధీనంతో షాక్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు విచారణ విషయంలో ఈడీ, సీబీఐ మరింత దూకుడు ప్రదర్శించాయి. గురువారం రోజంతా రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి విచారణ హైలెట్‌గా నిలిచింది. తన కుమారుడి బ్యాంక్ అకౌంట్లలో అవకతవకలు జరిగాయంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీబీఐ, ఈడీలు ఈ కేసుపై మరింత తీవ్రంగా దర్యాప్తు చేపట్టాయి. ఈ క్రమంలో ఇంద్రజిత్ చక్రవర్తిని రోజంతా విచారించగా...

రియా తండ్రిని రోజంతా విచారణ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తి కుటుంబంపై పీఎంఎల్‌ఏ కేసును ఈడీ నమోదు చేశారు. గతంలో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఈడీ విచారించింది. తాజాగా రియా తండ్రిని మరోసారి విచారించాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే గురువారం రోజంతా ఇంద్రజిత్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం.

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా
ఇంద్రజిత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించే సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా విచారణలో పాల్గొన్నారు. డ్రగ్స్ మాఫియాతో లింకుల బయటకు రావడంతో ఎన్సీబీకి చెందిన అధికారి కేపీఎస్ మల్హోత్రా ఈ విచారణలో భాగమయ్యారు. ఈ అంశంలో కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.

యాక్సిస్ బ్యాంక్‌లో అకౌంట్ల తనిఖీలు
ముంబై ఈడీ కార్యాలయంలో ఇంద్రజిత్‌ను పలు విషయాలపై ప్రశ్నించిన అనంతరం ఆయనను యాక్సిస్ బ్యాంక్‌కు తీసుకెళ్లారు. వకోలా ప్రాంతంలోని యాక్సీస్ బ్యాంకు అధికారుల నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. ఇంద్రజిత్, రియా చక్రవర్తి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేశారు. అలాగే బ్యాంకు నుంచి రియా కుటుంబానికి సంబంధించిన అకౌంట్ పత్రాలను, లాకర్ తాళాలను స్వాధీన పరుచుకొన్నారు.
Recommended Video

బాలీవుడ్ హీరోలపై ఎన్సీబీ నజర్
ఇక సుశాంత్ మరణం కేసు, డబ్బు దుర్వినియోగం, డ్రగ్స్ లింకుల అంశాలపై ఈడీ, సీబీఐ త్వరలోనే రియా చక్రవర్తిని విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ బడా హీరోల పాత్ర గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. దాదాపు 20 మంది బాలీవుడ్ ప్రముఖులకు, రాజకీయ నేతలకు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో రియాకు వారితో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో సమాచారాన్ని సేకరిస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











