వావ్.. ఏక్తాకపూర్.. బాధితులకు అకౌంట్లోకి నేరుగా ఆర్థిక సాయం
కరోనావైరస్ విలయ తాండవం చేస్తున్న సమయంలో బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ మరోసారి మానవత్వాన్ని చాటుకొన్నారు. లాక్‌డౌన్ కారణంగా రోజువారీ జీవితం గడవటం కష్టంగా మారిన సమయంలో ప్రతీ రంగంలోని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో రిటైర్డ్ ఫోటో జర్నలిస్టులకు ఏక్తా కపూర్ ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకొన్నారు. నేరుగా వారికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. ఉపాధికి దూరమైన ఫోటో జర్నలిస్టుల వివరాలు సేకరించి వారి అకౌంట్లకే డబ్బును జమ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఏక్తా కపూర్ చేసిన ఆర్థిక సహాయం గురించి ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఉద్యోగాలు లేక సతమవుతున్న సమయంలో ఇలాంటి విపత్తు మమల్ని ఆర్థికంగా మరింత కుంగదీసింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ఇలాంటి ఆపద సమయంలో ఏక్తాకపూర్ మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. ఉపాధి కరువైన ఫోటోజర్నలిస్టులకు సహాయం అందించేందుకు నేరుగా భారీ మొత్తాన్ని అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారు అని భయానీ తెలిపారు.

ఏక్తా కపూర్ మాత్రమే కాకుండా సినీ హీరో హృతిక్ రోషన్, నిర్మాత రోహిత్ శెట్టి తదితరులు ఉద్యోగాలు లేక బాధపడుతున్న ఫోటో జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించడం గమనార్హం. ఇక ఏక్తా కపూర్ ప్రస్తుతం ముంబైలో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన ఆమె దినసరి, ఆసక్తికరమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు.
ఇప్పటికే కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ సేవలు స్తంభించడంతో భారీ సంఖ్యలో సినీ రోజువారీ వేతన కార్మికులు రోడ్డున పడ్డారు. అలాంటి వారిని ఆదుకోనేందుకు అన్ని భాషల సినీ ప్రముఖులు తమ వంతుగా ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











