భర్తకు స్వయంగా తలకొరివి పెట్టిన మందిరా బేడి.. భోరున విలపిస్తుండగా అంత్యక్రియలు!
బాలీవుడ్‌లో ప్రముఖ నటి మందిరా బేడీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన భర్త, దర్శక, నిర్మాత రాజ్ కౌశల్ ఆకస్మిక మరణంతో ఆమె కోలుకోలేని విధంగా విషాదానికి గురయ్యారు. జూన్ 30 తేదీ బుధవారం తెల్లవారుజామున రాజ్ కౌశల్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాజ్ కౌశల్ అంత్యక్రియలు బుధవారం ఉదయం పూర్తి చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

పుట్టెడు దు:ఖంలో మందిరా బేడి
భర్త రాజ్ కౌశల్ ఆకస్మిక మరణంతో మందిరాబేడి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. పిల్లల్ని ఓదార్చుతూనే మందిరా బేడి షాక్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు అని సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. పుట్టెడు దు:ఖంలో ఉన్న మందిరాబేడికి సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఆమెను వ్యక్తిగతం పరామర్శించి ఓదార్చారు.

మందిరాబేడి ఇంటికి బాలీవుడ్ ప్రముఖులు
దర్శకుడు రాజ్ కౌశల్ మరణ వార్త వినగానే బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంతాప సందేశాలతో ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. వార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులు హ్యుమా ఖురేషి, అపూర్వ అగ్నిహోత్రి, సమీర్ సోని, రోహిత్ రాయ్, గుల్ పనాగ్, ఆశీష్ చౌదరీ తదితరులు మందిరా బేడి నివాసానికి తరలివచ్చారు.

నేహా దుపియా, అనుపమ్ ఖేర్ సంతాపం..
భర్త మరణంతో విషాదంలో మునిగిపోయిన మందిరాబేడికి బాలీవుడ్ హీరోయిన్లు నేహా దూపియా, దివ్యా దత్తా, ప్రముఖులు అనుపమ్ ఖేర్, లారా దత్తా, రణ్‌వీర్ శ్రాయ్, గౌరవ్ చోప్రా, సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో శ్రద్దాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

బంద్రా శ్మశాన వాటికలో అంత్యక్రియలు
భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు ముంబైలోని బాంద్రా శ్మశాన వాటికలో అభిమానులు, స్నేహితులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ముగిసాయి. సినీ ప్రముఖులు రాజ్ కౌశల్ పార్ధీవ దేహాన్ని భుజాలపై మోశారు. కన్నీటి సాగరంలో ఉన్న మందిరాబేడి తన భర్తకు తల కొరివి పెట్టారు. అంత్యక్రియల సమయంలో మందిరా బేడి భోరున విలపించడంతో స్నేహితులు ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు అని స్నేహితులు మీడియాకు వెల్లడించారు.

ప్రేమ వివాహంతో ఒక్కటైన మందిరాబేడి, రాజ్ కౌశల్
మందిరా బేడి, రాజ్ కౌశల్‌ది ప్రేమ వివాహం. చాలా సంవత్సరాలు ప్రేమించుకొన్న వారు ఫిబ్రవరి 14వ తేదీ 1999లో వివాహం చేసుకొన్నారు. 2011లో వారికి వీర్ అనే కుమారుడు జన్మించాడు. చాలాకాలం పిల్లలు లేకపోవడంతో 2020 అక్టోబర్‌లో ఓ అమ్మాయిని దత్తత చేసుకొని తారా బేడి కౌశల్ అనే నామకరణం చేశారు. వీర్, తారా బేడి అంటే రాజ్ కౌశల్‌కు చెప్పలేనంత ప్రేమ అని వారి సన్నిహితులు తెలిపారు.


Click it and Unblock the Notifications











