హారర్ సినిమాల డైరెక్టర్ తులసి రామ్‌సే ఇక లేరు
హారర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫిల్మ్ మేకర్ తులసి రామ్‌సే ఇక లేరు. 77 ఏళ్ల తులసి రామ్‌సే శుక్రవారం తెల్లవారుఝామున కన్నుమూశారు. 80స్, 90స్‌లో 'వీరనా', 'పురానీ హవేలీ', 'బంద్ దర్వాజా' లాంటి కల్ట్ హారర్ చిత్రాలతో తులసి రామ్‌సే ప్రఖ్యాతి గాంచారు.
చెస్ట్ పెయిన్ రావడంతో రామ్‌సేను అతని కుమారుడు దీపక్ గురువారం సాయంత్రం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుఝామున 2.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తులసి రామ్‌సే తన ఆరుగురు అన్నదమ్ములు కుమార్ రామ్‌సే, శ్యామ్ రామ్‌సే, కేషు రామ్‌సే, అర్జున్ రామ్‌సే, గంగు రామ్‌సే, కిరణ్ రామ్‌సేతో కలిసి ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో సరికొత్త హారర్ జోనర్ సినిమాలను ఆవిష్కరించారు.
తులసి రామ్‌సే మరణించిన విషయాన్ని ఖరారు చేస్తూ ఆయన నెప్యూ అమిత్ రామ్‌సే ట్వీట్ చేశారు. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు జరుగనున్నాయి.


Click it and Unblock the Notifications