మికా సింగ్‌తో పని చేస్తే సల్మాన్ ఖాన్ మీద కూడా నిషేధం విధిస్తారట!
బాలీవుడ్ సింగర్ మికా సింగ్ పాకిస్థాన్లో ఓ పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇవ్వడంతో అతడిపై ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అతడితో ఎవరూ పని చేయకూడదని, అలా చేస్తే వారిపై కూడా నిషేధం విధిస్తామని, లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆల్టిమేటమ్ జారీ చేసింది.
అయితే త్వరలో యూఎస్ఏలో ప్రారంభం కాబోయే సల్మాన్ ఖాన్ టూర్లో మికా సింగ్ కూడా భాగం కాబోతున్నారట. వచ్చే వారం నుంచి సల్మాన్ ఖాన్ అక్కడ ఆరు నగరాల్లో పర్యటిస్తూ అభిమానులను అలరించబోతున్నాడు. ఈ టూర్లో మికా సింగ్ కూడా పాల్గొంటున్నారని, ఆగస్టు 28న హూస్టన్‌లో జరిగే షోలో అతడు జాయిన్ అవతాడని తెలుస్తోంది.

తనపై విధించిన బ్యాన్ విషయమై చర్చించేందుకు మికా సింగ్ ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్‌ను కలవబోతున్నారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య టెన్షన్ వాతావరణం ఉన్న నేపథ్యంలో తాను ఎందుకు పాకిస్థాన్లో ప్రదర్శన ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇవ్వబోతున్నారు. అతడి వివరణ సహేతుకంగా ఉంటే బ్యాన్ ఎత్తివేసే అవకాశం ఉంది. లేకపోతే నిషేధం కొనసాగే అవకాశం ఉంది.
మికా సింగ్ మీద నిషేధం కొనసాగుతున్న సమయంలో అతడితో ఎవరు పని చేసినా వారు కూడా నిషేధానికి గురవుతారని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ అశోక్ దూబే తెలిపారు. ఇది టెక్నీషియన్లతో పాటు నటులు, దర్శకులు, నిర్మాతలు అందరికీ వర్తిస్తుందన్నారు. ఒకవేళ సల్మాన్ ఖాన్ పని చేసినా అతడిపై కూడా నిషేధం విధిస్తామని హెచ్చరిచారు.


Click it and Unblock the Notifications











