‘ఆ హీరో డైలాగ్ చెప్పమంటే వణికిపోతాడు.. వాడికి కోట్లలో రెమ్యునరేషనా’
బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు హీరోలు - దర్శకుల మధ్య చిత్ర పరిశ్రమలో ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. పాన్ ఇండియా యుగంలో అది మరింత తీవ్రరూపు దాల్చింది. హీరోల నటన, రెమ్యునరేషన్‌పై తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. కొందరు హీరోలకు కోట్లలో పారితోషికం ఇస్తున్నారని.. అది కరెక్ట్ కాదనేది కొందరి వాదన. ఏమాత్రం నటన రాని వాడికి కోట్లలో పారితోషికాలు ఇస్తున్నారని మండిపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోపై దర్శకుడు ఇలాంటి కామెంట్సే చేశాడు. ఈ వివరాల్లోకి వెళితే..
ది కాశ్మీర్ ఫైల్స్‌తో పాపులారిటీ
జమ్మూకాశ్మీర్‌లో 90వ దశకంలో రక్తపుటేరులు పారించిన కాశ్మీరీ పండిట్ల ఊచకోత, తీవ్రవాదుల దాడులు, ఇతర దారుణాలపై తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క సినిమాపై ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. బీజేపీకి అనుకూలంగా ఈ సినిమాను తీశారంటూ పలు విమర్శలు ఎదురైనా వాటిని ధీటుగా ఎదుర్కొన్నారు వివేక్. ఈ సినిమాతో ఆయనకు పాపులారిటీ వచ్చింది.

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో
2005లో చాక్లెట్ సినిమాతో దర్శకుడిగా మారిన వివేక్ అగ్రిహోత్రి ఈ 20 ఏళ్ల కెరీర్‌లో తీసింది 11 సినిమాలు మాత్రమే. దివంగత భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం చుట్టూ ఉన్న మిస్టరీ ఆధారంగా తెరకెక్కించిన ది తాష్కెంట్ ఫైల్స్ చిత్రం విమర్శకు దారి తీసింది. ఆ వెంటనే ది కాశ్మీర్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్, ది వ్యాక్సిన్ వార్, ది బెంగాల్ ఫైల్స్ సినిమాలు తీసి సంచలనం సృష్టించారు. ఇటీవలి కాలంలో సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో వివేక్ వార్తల్లో ఉంటున్నారు.
మేనేజర్లపై మండిపాటు
మొన్నామధ్య ఎంతో మంది నటీనటుల కెరీర్‌ను మధ్యలో ఉన్నవాళ్లే నాశనం చేస్తున్నారంటూ మేనేజర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇండస్ట్రీలో ఒక్క నటుడు, 200 మంది క్యాస్టింగ్ డైరెక్టర్లు, 15860 మంది మేనేజర్లు అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మేనేజర్ ఓవరాక్షన్ కారణంగా ఓ స్టార్‌ను సినిమాలో నుంచి తీసేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇక షారుఖ్ ఖాన్ - దీపిక పదుకొణెలు నటించిన పఠాన్ మూవీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరి మధ్య వచ్చిన బేషరమ్ రంగ్ పాటను సెక్యులర్ వ్యక్తులు చూడలేరంటూ బాంబు పేల్చారు.
డైలాగ్స్ తగ్గించమన్నాడు
తాజాగా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంపై వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2007లో ధన్ ధనా ధన్ గోల్ సినిమా నిర్మాణ సమయంలో తాను ఎదుర్కోన్న సమస్యల గురించి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. గోల్ సినిమా పాటలు ఇప్పటికీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయని, సినిమా కూడా ఇప్పటి కాలానికి అనుగుణంగా ఉంటుందని వివేక్ అన్నారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే బిపాసా, జాన్ అబ్రహంలు విడిపోయారని తెలిపారు. ఈ సినిమాకు జాన్ అబ్రహం ఏమాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపించిందని.. ఎలా ఈ సినిమాలో భాగమయ్యాడో నాకు అర్ధం కాలేదని వివేక్ దుయ్యబట్టారు. సినిమాలో డైలాగ్స్ తగ్గించాలని వివేక్ నన్ను అడిగాడని.. ఐదు లైన్ల డైలాగ్స్‌ను ఏకధాటిగా చెప్పలేకపోయాడని, అలాంటి వ్యక్తికి కోట్లలో పారితోషికం ఎందుకివ్వాలని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి దీనిపై జాన్ అబ్రహం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











