‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్... ‘కబీర్ సింగ్’పై షాకింగ్ రివ్యూలు
తెలుగులో సూపర్ హిట్ అయిన కల్ట్ మూవీ 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం బాలీవుడ్ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు వెర్షన్ డైరెక్టర్ సందీప్ వంగా హిందీలోనూ దర్శకత్వం వహించారు.
అయితే ఈ చిత్రానికి బాలీవుడ్ సినీ విమర్శకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు లేడీ క్రిటిక్స్ ఈ మూవీకి పూర్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఇది మహిళలు చూసే సినిమా కాదు అంటూ ఓ ప్రముఖ క్రిటిక్ విమర్శించారు.

బి-గ్రేట్ మూవీ అంటూ
ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థకు సంబంధించి వెబ్ సైట్లో ‘కబీర్ సింగ్' చిత్రానికి రివ్యూ రాసిన లేడీ క్రిటిక్ ఈ చిత్రంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ‘అర్జున్ రెడ్డి' చిత్రాన్ని బి-గ్రేడ్ మూవీగా పేర్కొంటూ ‘కబీర్ సింగ్' మూవీలో హీరో మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడాన్ని ఎక్కువ చూపించారంటూ పేర్కొంటూ కేవలం 1.5/5 రేటింగ్ మాత్రమే ఇచ్చారు.

సినిమా సూపర్ అంటూ మరికొందరు..
అయితే మరికొన్ని బాలీవుడ్ వెబ్ సైట్లలో ‘కబీర్ సింగ్' మూవీ బావుందని, షాహిద్ కపూర్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది అంటూ 3.5/5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఇలా బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది.

అవార్డులు ఖాయం అంటున్న బాలీవుడ్ ప్రముఖులు
‘కబీర్ సింగ్' చిత్రంలో షాహిద్ కపూర్ అద్భుతంగా నటించాడని, అతడికి అవార్డులు ఖాయం అంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. సినిమా తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని, మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

గర్వంగా ఉందంటున్న షాహిద్ భార్య మీరా
ఈ సినిమాపై షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ స్పందించారు. తన భర్త ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉందంటూ వ్యాఖ్యానించారు, కబీర్ సింగ్ పాత్ర నటుడిగా అతడిని మరింత షైన్ చేస్తుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో షాహిద్-కియారా మధ్య ఘాటైన ముద్దు, శృంగార సన్నివేశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ సినిమా కథలో భాగమే అని, వీటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదంటోంది మీరా.

కబీర్ సింగ్ ఆడియన్స్ రిపోర్ట్
క్రిటిక్స్, సినీ ప్రముఖుల సంగతి పక్కన పడితే సగటు బాలీవుడ్ ప్రేక్షకుడి నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రం షాహిద్ కెరీర్లో మరో హిట్ చిత్రంగా నిలవడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











