కంగనాకు ఊహించని షాక్.. బహిష్కరిస్తూ మీడియా కీలక నిర్ణయం
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ముందుంటుంది. గతంలో 'మణికర్ణిక' సినిమాతో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈమె.. ఇటీవలే జర్నలిస్టులతో వైరం పెట్టుకుంది. కంగనా రనౌత్, జర్నలిస్టులకు మధ్య రగిలిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి సంచలనంగా మారింది. ఈ వివాదంపై తాజాగా బాలీవుడ్ మీడియా తీసుకున్న నిర్ణయం కంగనాతో పాటు ప్రేక్షకులందరికీ షాక్ ఇచ్చింది.
ఇటీవల 'జడ్జిమెంటల్ హై క్యా' ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా ఓ జర్నలిస్ట్‌తో వాగ్వివాదానికి దిగింది కంగనా. తన మణికర్ణిక చిత్రం గురించి వ్యతిరేకంగా రాశాడనే కోపంతో కంగన సదరు మీడియా ప్రతినిధితో దుర్భాషలాడింది. దీంతో జర్నలిస్టులంతా ఏకమై కంగనా రనౌత్ క్షమాపణ చెప్పాలని నిలదీశారు. లేని పక్షంలో కంగనాపై బ్యాన్ విధిస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ కంగనా నుంచి ఎలాంటి స్పందన రాలేదు సరికదా.. కుదిరితే తనను బ్యాన్ చేయాలంటూ వీడియో రిలీజ్ చేసి వివాదాన్ని మరింత పెద్దది చేసింది కంగనా రనౌత్. పైగా ఆ వీడియోలో జర్నలిస్టులను దూషించడంతో వారి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగి ఆమెను బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

కంగనాపై నిషేధం విధిస్తున్నామని పేర్కొంటూ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన జారీ చేసింది. కంగనా రనౌత్ మీడియా ప్రతినిధిని దూషించడం సహించరాని చర్యగా అందులో పేర్కొనడం జరిగింది. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా జరీ చేసిన ఈ ప్రకటనపై ముంబైలోని ఎంటర్టైన్మెంట్ జర్నలిస్టులు మద్దతు తెలిపారు. దీంతో కంగనా రనౌత్ కి ఊహించని షాక్ తగిలినట్లయింది.


Click it and Unblock the Notifications











