కంగన రనౌత్‌కు భారీ దెబ్బ.. భారమైన హృదయంతో అల్లాడిన బాలీవుడ్ క్వీన్!
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌కు ప్రతికూల పరిస్థితులు, కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లినా ఈ సమస్యలను ఎదుర్కోవడం తప్పడం లేదు. గత కొద్దికాలంగా వరుస ఫ్లాపులతో అల్లాడుతున్న ఈ భామ తన రూపొందించిన ఎమర్జెన్సీ మూవీపై గంపెడాశలు పెట్టుకొన్నది. అయితే ఆమె ఆశలపై సెన్సార్ బోర్టు నీళ్లు చల్లడంతో ఆవేదనతో సోషల్ మీడియాలో స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..
మణికర్ణిక ఫిలింస్, జీ స్టూడియో బ్యానర్లపై కంగన రనౌత్, జీ స్టూడియోస్, రేణు పిట్టి నిర్మాతలుగా కంగన రనైత్ దర్శకత్వం వహించిన ఈ ఈ సినిమా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితంలోని కొన్ని కీలక అంశాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు కథను కూడా ఆమె సమకూర్చడం విశేషంగా మారింది.

సుమారుగా 100 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ సినిమాను సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ మూవీలోని కంటెంట్ గురించి సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారు.
ఎమర్జెన్సీ మూవీ సినిమా వాయిదా పడిన నేపథ్యంలో కంగన రనౌత్ సోషల్ మీడియాలో ఆవేదనను వ్యక్తం చేసింది. నా దర్శకత్వంలో వస్తున్న తొలి సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటం వల్ల బాధతో హృదయం భారంగా మారింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ఈ పరిస్థితి అర్దం చేసుకొన్న నా అభిమానులకు, సహనంతో వేచి చూస్తున్న ప్రేక్షకులకు నా థ్యాంక్స్ అంటూ ఆమె పోస్టు చేశారు.

ప్రియదర్శిని ఇందిరా గాంధీ జీవిత కథగా వస్తున్న ఈ చిత్రంలో కంగన రనౌత్ స్వయంగా ఇందిరా గాంధీ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరీ, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ తదితరులు నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్, ఆర్కో సంగీతం అందించారు. సంచిత్, అంకిత్ బెహ్రా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశారు.


Click it and Unblock the Notifications











