హైదరాబాద్‌లో కంగనాకు చేదు అనుభవం.. బ్లాంకెట్లు అడ్డు పెట్టుకుని వెళ్లినా వదల్లేదట.!
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దీనికి ఆమె చేసిన సినిమాలతో పాటు, ఎదుర్కొన్న వివాదాలూ కారణమే. ఈ స్టార్ హీరోయిన్ ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా వివాదంలో చిక్కుకుంటూనే ఉంటోంది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అంతేకాదు, కంగనా రనౌత్ దేశం మొత్తానికి నటిగా కంటే వివాదాస్పద సెలెబ్రిటీగా బాగా సుపరిచితురాలు అయిపోయింది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం కంగనా మాత్రం కాదు. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

వివాదాలతోనే సహవాసం
కంగనా రనౌత్ ఎక్కువగా వివాదాలతోనే సహవాసం చేస్తుంటుంది. ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలపై కామెంట్లు చేయడం ఆమెకు అలవాటు అయిపోయింది. అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌తో చెలరేగిన వివాదం మరువక ముందే ఆమె ఎన్నో సార్లు వార్తల్లోకి ఎక్కింది. అలాగే, మన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితోనూ గొడవ పడింది. అలాగే జర్నలిస్టులను తిట్టి ఇరుక్కుంది.

సినిమాలు కూడా అలాంటివే
ఈ స్టార్ హీరోయిన్ వ్యక్తిగత ప్రవర్తనతోనే కాకుండా.. సినిమాల పరంగానూ వివాదాస్పదం అవుతోంది. ఆమె ఎంచుకునే సినిమాలు సున్నితమైన కథల ఆధారంగా తెరకెక్కుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే చాలా సార్లు ఆమె ఈ తరహా వివాదాలను ఎదుర్కొన్నారు. దీంతో కంగనా సినిమాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోతున్నాయి.

మళ్లీ అదే తరహా కథతో
ప్రస్తుతం కంగనా రనౌత్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె టైటిల్ రోల్ చేస్తోంది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథా కథనాలు అందించారు. ఇందులో అరవింద స్వామి, ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.

కంగనాకు చేదు అనుభవం
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. దీనికి చూసేందుకు వచ్చిన పలువురు వ్యక్తులు కంగనాతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారట. దీంతో ఆమెకు చిరాకు వచ్చి బ్లాంకెట్లు అడ్డు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందని అంటున్నారు. గతంలో తాను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనలేదని అసహనం వ్యక్తం చేసిందట ఈ స్టార్ హీరోయిన్.


Click it and Unblock the Notifications











