The Kashmir Files బాలీవుడ్ మాఫియా నోరు విప్పదే.. కంగన రనౌత్ ఫైర్
బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ స్టార్‌లపై విమర్శలు ఎక్కుపెట్టింది. వీలు కుదిరినప్పుడల్లా బాలీవుడ్ మాఫియా అంటూ టార్గెట్ చేసే కంగన ఇప్పటికే గంగూబాయ్ కతియావాడి సినిమాపై లెక్కలేనన్ని విమర్శలు చేసింది. తాజాగా మరోసారి బాలీవుడ్ పెద్దలపై సోషల్ మీడియా ద్వారా విమర్శల దాడి చేసింది. తాజాగా విడుదలైన సంచలన సినిమా ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఊటంకిస్తూ కంగన ట్రోలింగ్‌కు పాల్పడింది.

ది కశ్మీర్ ఫైల్స్
ఇటీవల విడుదలైన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు అనుకూలంగా, ప్రతికూలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఉత్తరాదినే కాదు.. దక్షిణాదిలో కూడా ఈ సినిమా సంచలనాలు నమోదు చేస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరో అనుపమ్ ఖేర్ నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. రోజు రోజుకూ ఈ సినిమా కలెక్షన్లు రెట్టింపవుతున్నాయి. మూడు రోజుల్లో ఈ సినిమా రూ.30 కోట్లు వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది.

కరోనా తర్వాత తొలి హిట్ అంటూ కంగన పోస్ట్
ఈ సినిమా గురించి కంగన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. `కరోనా మహమ్మారి తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో నిజమైన హిట్‌గా నిలిచిన సినిమా `ది కశ్మీర్ ఫైల్స్`. ఈ సినిమా విజయం గురించి బాలీవుడ్ మాఫియా, దానితో కుమ్మక్కైన మీడియా చెప్పదు. అందుకే నేను చెబుతున్నా. చిత్ర పరిశ్రమ నుంచి ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడడం లేదు. అందుకే నా బాధ్యతగా నేను ఆ సినిమాను ప్రమోట్ చేస్తున్నా' అని కంగన రాసుకొచ్చింది.

నేపథ్యం ఏంటి?
1990ల్లో జమ్ము-కశ్మీర్‌లో అల్లరి మూకలు చెలరేగిపోయాయి. తీవ్రమైన తిరుగుబాటు చెలరేగింది. కశ్మీర్‌లో ఉంటున్న హిందువులపై ఘోరమైన హింస చెలరేగింది. మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా అల్లరి మూకలు హిందువులపై దాడికి తెగబడ్డాయి. ఆ దారుణాన్ని తట్టుకోలేక ఎన్నో కశ్మీరీ పండిట్ కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయాయి. ఆ నేపథ్యంలో తీసిన చిత్రమే `ది కశ్మీర్ ఫైల్స్`. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కశ్మీరీ పండిట్‌గా అనుపమ్ ఖేర్ నటన ఎంతో మందిని ఆకట్టుకుంది.

చుట్టుముట్టిన వివాదాలు
ఈ సినిమాకు మధ్యప్రదేశ్, హరియాణా, గుజరాత్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీ కల్పించాయి. ఈ సినిమాపై ఒక వర్గం వారు విరుచుకుపడుతున్నారు. కశ్మీరీ పండిట్లను ఊచకోత కోసిన విలన్లుగా తమను చిత్రీకరించి, తమ మనోభావాలను చిత్ర దర్శకుడు గాయపరిచాడని పేర్కొంటూ యూపీకి చెందిన ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. అలాగే భారత ఆర్మీలో స్క్వాడ్రన్ లీడర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన వ్యక్తి భార్య కూడా ఈ సినిమాపై పరువు నష్టం దావా వేసింది. అలాగే పలువురు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Recommended Video


ఆలియాపై కంగన పరోక్ష సెటైర్లు
ఆలియా కథానాయికగా సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన `గంగూబాయ్ కతియావాడీ` సినిమా ఇటీవల విడుదలై ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో నటనకుగానూ ఆలియా ఎన్నో ప్రశంసలు అందుకుంది. అయితే కంగన మాత్రం ఆ సినిమాపై, ఆలియాపై విరుచుకుపడింది. తాజాగా `ది కశ్మీర్ ఫైల్స్` సినిమాను ప్రశంసిస్తూ మరోసారి ఆలియా సినిమాను కంగన టార్గెట్ చేసింది. కరోనా తర్వాత విడుదలైన సినిమాల్లో నిఖార్సైన విజయం సాధించిన చిత్రం `ది కశ్మీర్ ఫైల్స్` మాత్రమేనని పేర్కొంది.


Click it and Unblock the Notifications











