Brahmastra ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వనున్న ఆలియా భట్.. బ్రహ్మస్త్ర ఈవెంట్‌లో కరణ్ జోహర్
బాలీవుడ్ చిత్రం బ్రహ్మస్త్ర చిత్రాన్ని దక్షిణాదిలో ఎస్ఎస్ రాజమౌళి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున తదితరులు నటించారు. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించాల్సిన బ్రహ్మస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడటంతో ఆ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఉత్తరాది, దక్షిణాది మీడియాకు ఆలియా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ వివరాల్లోకి వెళితే..

బ్రహ్మస్త్ర 10 ఏళ్ల ఎమోషన్
బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కార్యక్రమంలో ఆలియాభట్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీరంతా ఈవెంట్‌ను చూడటానికి ఉత్సాహంగా వచ్చారు. ఇది కూడా ఈవెంట్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. అయితే బ్రహ్మస్త్ర గురించి ఎమోషనల్ విషయాలను మీతో పంచుకోవాలని ఉంది. ఈ సినిమా మాకు పదేళ్ల ఎమోషన్. అలాంటి ఎమోషన్‌ను 10 నిమిషాల్లో పంచుకోవడానికి సమయం సరిపోదు అని ఆలియా భట్ అన్నారు.

ఆయాన్ ముఖర్జీ ప్రాణం పెట్టి
బ్రహ్మస్త్ర సినిమా రిలీజ్ కోసం మేమంతా ఈ సినిమా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా కోసం ఆయాన్ ముఖర్జీ ప్రాణం పెట్టారు. ఆయన కష్టం ముందు.. మా కష్టం చాలా చిన్నది. మమల్ని గైడ్ చేశారు. ప్రస్తుతం ఫైనల్ ప్రొడక్ట్‌ను డెలివర్ చేయడానికి ఇంకా శ్రమిస్తున్నారు. అందుకే ఈ ఫంక్షన్‌కు రాలేకపోయాడు. మా తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలపండి అని ఆలియా భట్ అన్నారు.

ఆయాన్‌కు ఎక్కిళ్లు పడుతున్నాయేమో
ఆలియాభట్ మాట్లాడుతుండగా.. రణ్‌బీర్ కపూర్ జోక్యం చేసుకొన్నారు. గత గంట సేపటి నుంచి ఆయాన్ గురించి మాట్లాడుతున్నారు. బహుశా ఆయనకు ముంబైలో ఎక్కిళ్లు పడుతుంటాయేమో అని రణ్‌బీర్ చమత్కరించారు. దాంతో భర్త రణ్‌బీర్‌కు వంత పాడుతూ.. అవును తప్పకుండా ఆయాన్‌కు ఎక్కిళ్లు పడి ఉంటాయి అని ఆలియా నవ్వుల్లో మునిగిపోయారు.

నేను రాజమౌళి హీరోయిన్‌గా
బ్రహ్మస్త్ర మూవీకి అండగా నిలిచిన ఎస్ఎస్ రాజమౌళికి ఆలియా ధన్యవాదాలు తెలిపారు. మీ RRR మూవీలో నన్ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకొన్నందుకు రుణపడి ఉంటాను. ఇప్పుడు అందరూ రాజమౌళి హీరోయిన్ అని గొప్పగా చెబుతున్నారు. బ్రహ్మస్త్ర సినిమాకు మీరు హీరోగా మారారు. అందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. మా సినిమాకు సపోర్ట్‌గా నిలిచినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నందుకు థ్యాంక్స్ అని ఆలియాభట్ అన్నారు.

తారక్ ఓ మెగాస్టార్
తెలుగు సినిమా పరిశ్రమలో తారక్ అంటే ఎంత క్రేజ్, ప్రేమ ఉందో నాకు తెలుసు. ఆయన ఈ ఇండస్ట్రీలో మెగాస్టార్. ఈ సినిమాకు అండగా నిలిచి మరోసారి మా హృదయాల్లో కూడా మెగాస్టార్ అయ్యారు. తారక్ మంచి హృదయం ఉన్న వ్యక్తి. అందుకే ఇంత మంది ఫ్యాన్స్ ఆయన ప్రేమిస్తారు. నాగార్జున అక్కినేని కూడా ధన్యవాదాలు. ఆయన నిజంగా కింగ్ లాంటి వారు అని ఆలియా భట్ అన్నారు.

ఆలియాభట్ ప్రెగ్నెన్సీ గురించి
అంతకు ముందు బ్రహ్మస్త్ర మూవీలో హీరో, హీరోయిన్లుగా నటించిన ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్‌ను కరణ్ జోహర్ పరిచయం చేస్తూ.. ఈ సంవత్సరం ఆలియా ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తున్నది. ఒక బిడ్డ సెప్టెంబర్ 9వ తేదీన బ్రహ్మస్త్ర రూపంలో పురుడు పోసుకొంటున్నది. ఆ తర్వాత మరో బిడ్డకు జన్మనివ్వబోతుంది అని అన్నారు. ఈ సందర్భంగా ఆలియా తన డ్రస్ వెనుక భాగాన.. బేబీ ఆన్ బోర్డ్ అని ప్రింట్ చేసుకొన్న అక్షరాలను మీడియాకు,ప్రేక్షకులకు కరణ్ చూపించారు.


Click it and Unblock the Notifications











