30 వేల కోట్ల సంపద... పిల్లలకు ఫీజు కట్టలేకపోతున్న స్టార్ హీరోయిన్, ఏం జరిగిందంటే?
ఎవరి స్థాయికి తగిన విధంగా వారికి కష్టాలు వస్తుంటాయి. వేల కోట్లకు అధిపతి అయినా వారికి కూడా చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి. తాజాగా భారతీయ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ... తన పిల్లలకు కనీసం స్కూలు ఫీజులు కట్టలేకపోతోంది ఓ ముద్దుగుమ్మ. ఈ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు. వేల కోట్ల సంపద ఉన్నా ఎందుకు ఇబ్బందులు పడుతోంది? ఈ వివరాల్లోకి వెళితే..
కపూర్ వారసురాలిగా గుర్తింపు
సదరు హీరోయిన్ ఎవరో కాదు కరిష్మా కపూర్. భారతీయ చిత్ర పరిశ్రమపై బలమైన ముద్ర వేసిన రాజ్ కపూర్ కుటుంబ వారసురాలు. 1991లో ప్రేమ ఖైదీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన కరిష్మా కపూర్ ఆ తర్వాత తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. అనంతరం సప్న్ సజన్ కే, జిగర్, అనారి, రాజా బాబు, సుహాగ్, అందాజ్, కూలీ నెంబర్ 1, జీత్, హీరో నెంబర్ 1, రాజా హిందుస్తానీ తదితర చిత్రాల్లో నటించారు. తొలినాళ్లలో అజయ్ దేవగణ్, అభిషేక్ బచ్చన్‌లతో ప్రేమాయణం సాగించిన కరిష్మ.. ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ని 2003 సెప్టెంబర్ 29న పెళ్లాడారు. ఈ దంపతులకు సమైరా, కియాన్‌లు సంతానం. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2016లో పరస్పర అంగీకారంతో కరిష్మ, సంజయ్‌లు విడిపోయారు. భర్త నుంచి విడిపోయినప్పటికీ సినిమాల్లో నటిగా కొనసాగుతూ.. పిల్లల బాధ్యతను తీసుకున్నారు కరిష్మా కపూర్.

గుండెపోటుతో సంజయ్ మృతి
ఇదిలాఉండగా.. సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌లోని గార్డ్స్ పోలో క్లబ్‌లో పోలో మ్యాచ్ ఆడుతుండగా ఓ చిన్న పురుగు ఆయన నోటిలోకి వెళ్లింది. దానిని బయటకు తీయాలని సంజయ్ ఎంతో ప్రయత్నించారు. ఆ సమయంలో తీవ్రమైన అలర్జీ రియాక్షన్‌కు గురైన ఆయనకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. దానితో పాటు తీవ్ర భయాందోళనకు గురికావడంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. సోనా కామ్‌స్టార్ అనే సంస్థకు సంజయ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీలో ఈ సంస్థ మన దేశంలో టాప్ ప్లేస్‌లో ఉంది. దేశంలోని బిలియనీర్లలో ఆయన కూడా ఒకరు. సంజయ్ ఆస్తుల విలువ 30 వేల కోట్లకు పైమాటే. ఆయన మరణంతో ఆస్తులు, వారసులు అనే గొడవలు బయటపడ్డాయి.
సంజయ్ ఆస్తులపై వివాదం
కరిష్మా కపూర్ కంటే ముందే నందిత మహతానీని పెళ్లాడిన సంజయ్ కపూర్.. 2000వ సంవత్సరంలో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత కరిష్మాను రెండో వివాహం చేసుకున్నారు. కరిష్మాతో విడాకుల తర్వాత మోడల్, నటి ప్రియా సచ్‌దేవ్‌ను సంజయ్ మూడో వివాహం చేసుకున్నారు. దీంతో సంజయ్ ఆస్తుల కోసం కరిష్మా కపూర్ పిల్లలకు, ఆయన మూడో భార్య ప్రియ సచ్‌దేవ్‌కు మధ్య గొడవలు జరిగి.. విషయం కోర్టుల వరకు వెళ్లింది. తమ తండ్రి వీలునామా విషయంలో ప్రియ సచ్‌దేవ్ తమను మోసం చేశారని కరిష్మ పిల్లలు సమైరా, కియాన్‌లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి సంజయ్ కపూర్ ఆస్తి నుంచి చట్టప్రకారం తమకు రావాల్సిన వాటాను ఇప్పించాలని వారు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
2 నెలలుగా ఫీజులు చెల్లించలేక
తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా సమైరా, కియాన్‌లు కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు చదువుకు సంబంధించి రెండు నెలలుగా ఫీజు చెల్లించలేదని తెలిపారు. కరిష్మా పిల్లల చదువుకు అయ్యే ఖర్చును సంజయ్ కపూర్ భరిస్తున్నారని.. ప్రస్తుతం ఆయన ఆస్తి ప్రియా సచ్‌దేవ్ నియంత్రణలో ఉందని వీరి తరపున వాదిస్తోన్న మహేశ్ జఠ్మలానీ కోర్టుకు తెలిపారు. అమెరికాలో చదువుతున్న సమైరాకు రెండు నెలలుగా ప్రియా ఫీజు చెల్లించడం లేదని వాదించారు. అయితే తన క్లయింట్.. కరిష్మ పిల్లల ఫీజును చెల్లిస్తున్నారని ప్రియా తరపు న్యాయవాది రాజీవ్ నాయర్ వాదించారు. కేవలం మీడియా అటెన్షన్ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ కేసుపై న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి సింగ్ మండిపడ్డారు. ఈ తరహా కేసులు కోర్టుకు వెలుపలే పరిష్కారమవుతాయని.. వాటిని బెంచ్ వద్దకు తీసుకురావొద్దని సూచించారు. దాంతో సంజయ్ కపూర్ ఆస్తుల కేసు ఏ మలుపు తిరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications











