16 ఏళ్ల బంధాన్ని తెంచుకొన్నా.. విడాకులిచ్చాకే ఫుల్ హ్యాపీగా.. స్టార్ హీరో భార్య సంచలన వ్యాఖ్యలు
కోలీవుడ్ , బాలీవుడ్, టాలీవుడ్.. దేశంలో ఇప్పుడు ఏ వుడ్ తీసుకున్నా విడాకుల అంశం మారుమోగుతోంది. సెలబ్రెటీలు సుదీర్ఘంగా డేటింగ్ చేసి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కినంత సేపు పడటం లేదు విడాకులు తీసుకోవడానికి. కారణం ఏదైనా విడిపోవడం వల్ల రెండు కుటుంబాలకు, బంధుమిత్రులకు, సన్నిహితులకు , నటీనటుల అభిమానులకు తీరని వ్యధ మిగులుతోంది. వీరిని కలిపేందుకు పెద్దలు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు.
సెలబ్రెటీ జంటల్లోని భార్య, లేదా భర్త .. తమ జీవిత భాగస్వామి ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేసినా వారి ఖాతాలను అన్ ఫాలో చేసినా జనానికి ఎక్కడో తేడా కొడుతోంది. గతంలో స్టార్ కపుల్స్ అక్కినేని నాగచైతన్య - సమంత, నిహారిక - చైతన్యల విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ జంట విడాకులు తీసుకోబోతోందని, లేదు తీసేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ముంబైలో జరిగిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ - నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహానికి భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం కుటుంబాలతో సహా తరలి వచ్చింది. ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో రావాల్సింది పోయి .. కుమార్తెతో వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చింది. అప్పుడే బీటౌన్ మీడియాకు ఏదో అనుమానం వచ్చింది. నిజానికి చిన్న బచ్చన్ - ఐష్ విడిపోతున్నారన్న వార్త ఇప్పటిది కాదు .. బచ్చన్ ఫ్యామిలీలో ఏదో అలజడి రేగుతోందని గతంలోనూ పుకార్లు వ్యాపించాయి. కానీ అంతా బాగానే ఉన్నట్లుగా తోచింది.
కానీ అంబానీ ఇంట్లో పెళ్లి మాత్రం ఐష్ - అభిషేక్ బచ్చన్ రిలేషన్‌పై ఎన్నో అనుమానాలను కలిగించింది. ఇలాంటి వేళ హీనా ఖండేల్వాల్ ఇన్‌స్టాలో పెట్టిన విడాకుల పోస్ట్‌కు లైక్ కొట్టడంతో పుకార్లకు బలం చేకూరినట్లయ్యింది. వీరే కాదు.. చిత్ర పరిశ్రమలో పలువురు స్టార్ కపుల్స్ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలతో సాంప్రదాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ వైవాహిక వ్యవస్థపై సెలబ్రెటీ డైవర్స్ ప్రభావం చూపే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు.
ఇదిలాఉండగా.. విడాకులు తీసుకుని తాను సంతోషంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు. 2005లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. దాదాపు 16 ఏళ్లకు పైనే కలిసి జీవించారు. కానీ అనూహ్యంగా అమీర్ - కిరణ్ విడిపోవడం అభిమానులను ఎంతగానో బాధించింది. ఈ నేపథ్యంలో విడాకులపై కీలక వ్యాఖ్యలు చేశారు కిరణ్ రావు. అమీర్‌తో విడిపోయిన తర్వాత తానేమి బాధపడటం లేదని చాలా హ్యాపీగా ఉన్నానని తెలిపారు.
16 ఏళ్ల బంధాన్ని తెంచుకోవాలని అనుకున్నప్పుడు మానసికంగా తట్టుకుని నిలబడినట్లు చెప్పారు. విడాకులకు ముందు నుంచే ఒంటరిగా ఉండటాన్ని అలవాటు చేసుకున్న తనకు పెద్దగా తేడా కనిపించలేదని, పైగా రెండు కుటుంబాల నుంచి బలమైన సపోర్ట్ ఉందని అందుకే సంతోషంగా ఉండగలుగుతున్నానని కిరణ్ రావు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు సోలో లైఫే సో బెటర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











