సల్మాన్ అక్కడ క్షమాపణ చెప్పు.. వదిలేస్తాం.. లేదంటే? లారెన్స్ బిష్ణోయి వార్నింగ్!
మహరాష్ట్రలో ప్రముఖ ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ బిష్ణోయి మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆయన హెచ్చరికల నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ప్రాణాలకు ముప్పు ఉండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో బిష్ణోయి ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సల్మాన్‌కు బిష్ణోయికి వైరం ఎక్కడ పుట్టింది? సల్లూభాయ్‌ని గ్యాంగ్‌స్టర్ ఎందుకు టార్గెట్ చేశాడు? బాబా సిద్దిఖీ హత్యకు కారణం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగు సమయంలో అంటే.. 1998 సంవత్సరంలో సల్మాన్ ఖాన్, సైప్ ఆలీ ఖాన్, టబూ, నీలం, సోనాలి బింద్రే తదితరులు రాజస్థాన్‌లో షూటింగ్ చేశారు. జోధ్‌పూర్‌కు సమీపంలోని మాథియానా ప్రాంతంలో సల్మాన్ ఖాన్ తన సహచరులతో కలిసి షూటింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకలను కాల్చి చంపారు.

కృష్ణ జింకల వేట ఆ సమయంలో సంచలనం రేపింది. సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో బిష్ణోయి కమ్యూనిటీ వాటిని దేవుళ్లకంటే అధికంగా పూజిస్తారు. దాంతో కోపం పెంచుకొన్న లారెన్స్ బిష్ణోయి.. సల్మాన్‌ను చంపుతానని ప్రతీకారంతో ఊగిపోయారు. ఆ సంఘటన జరిగినప్పుడు లారెన్స్ బిస్ణోయి వయసు 5 సంవత్సరాలు మాత్రమే. అలా పగతో రగిలిపోయిన ఆయన గ్యాంగ్‌స్టర్‌గా మారారని స్థానికులు తెలుపుతారు.
ఓ దశలో కొన్ని షరతులతో సల్మాన్‌కు క్షమాభిక్ష పెడుతున్నట్టు ప్రకటించారు. మా బిష్ణోయి కమ్యూనిటీ పవిత్రంగా భావించే మందిరం ముకమ్ ముక్తి మందిర్ ఉంది. అక్కడికి వచ్చి జరిగిందేదో జరిగిపోయింది. నాపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వాటి గురించి భగవంతుడికే తెలుసు. ఏదిఏమైనా క్షమించమని అడుగుతున్నాను. మీ కమ్యూనిటీ విశ్వాసాలను గౌరవిస్తానని చెప్పాలి. లేకపోతే శిక్ష అనుభవించాల్సిందే అని డిమాండ్ పెట్టారు.
అయితే పలుమార్లు సల్మాన్‌ను హెచ్చరించారు. అంతేకాకుండా ముంబైలొని ఆయన నివాసంపై దాడి కూడా చేశారు. తాజాగా సల్మాన్‌ను తీవ్రంగా హెచ్చరించే ప్రయత్నంలో ఆయన స్నేహితుడు, మాజీ మాత్రం బాబా సిద్దిఖీని దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలో సల్మాన్‌కు Y కేటగిరి భద్రతను ఏర్పాటు చేశారు.
సంచలనం రేపిన కృష్ణ జింకల కేసును జోధ్‌పూర్, సుప్రీం కోర్టు విచారించాయి. 2018 ఏప్రిల్ 5వ తేదీన ఈ కేసులో సల్మాన్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష, 10 వేల జరిమానా విధించారు. అయితే ఈ కేసుల సల్మాన్‌కు బెయిల్ లభించింది. అయితే ఈ వ్యవహారం సల్మాన్‌ను ఇప్పటికి కూడా వెంటాడుతూనే ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











