‘లక్ష్మీ బాంబ్’ వివాదం ముగిసింది: నిర్ణయం మార్చుకున్న రాఘవ లారెన్స్!
సౌత్‌లో సూపర్ హిట్ అయిన 'కాంచన' హిందీలో 'లక్ష్మీ బాంబ్' పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రాఘవ లారెన్స్ బాలవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇటీవల కొంత షూటింగ్ పూర్తయ్యాక ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ లుక్ పోస్టర్ తనకు తెలియకుండా రిలీజ్ చేశారని, నిర్మాతలు తనకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని, గౌరవం లేని చోట తాను పని చేయలేను అంటూ ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు లారెన్స్. వారం తర్వాత లారెన్స్ మరో ట్వీట్ చేస్తూ నా అభిమానులతో పాటు అక్షయ్ కుమార్ అభిమానుల నుంచి చాలా రిక్వెస్టులు వస్తున్నాయని, తిరిగి 'లక్ష్మీ బాంబ్' దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారని, నిర్మాతలతో చర్చల తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తానని తెలిపారు.

నిర్మాతలతో చర్చల అనంతరం రాఘవ లారెన్స్ ఎట్టకేలకు తన నిర్ణయం మార్చుకున్నారు. తిరిగి దర్వకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్ర ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. తన ఫీలింగ్స్ అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి తోడ్పడిన హీరో అక్షయ్ కుమార్, నిర్మాత షబినా ఖాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. ఇక లక్ష్మీ బాంబ్ షూటింగ్ చకచకా సాగుతుందని తెలిపారు.
తెలుగు, తమిళంలో రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'కాంచన' సూపర్ హిట్ కావడంతో దీన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ, తుషార్ కపూర్, ఆర్ మాధవన్, శోభిత ధూళిపాళ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2020 జూన్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. సబినా ఖాన్, తుషార్ కపూర్ కేప్ ఆఫ్ గాడ్ ఫిల్మ్స్, తుషార్ ఎంటర్టెన్మెంట్ హౌస్ బేనర్లో నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











