స్టార్ హీరోకి లీగల్ నోటీసులు.. ఇరుకునపడ్డ 'ప్రస్థానం'
ఈ మధ్యకాలంలో సినిమా వివాదాలు మరీ ఎక్కువైపోతున్నాయి. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యకో లేక షూటింగ్ ఫినిష్ అయి రిలీజ్ అయ్యాకో స్క్రిప్ట్ విషయంలో సమస్యలు తలెత్తుతుండటం చూస్తున్నాం. తాజాగా స్టార్ హీరో సంజయ్ దత్‌కి ఈ విషయమై లీగల్ నోటీసులు అందాయి. ఆయన తాజా సినిమా 'ప్రస్థానం' విడుదలకు ముందే చిక్కుల్లో పడింది.
తెలుగులో విడుదలై సక్సెస్ సాధించిన ప్రస్థానం సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు ప్రస్థానం చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించిన దేవా కట్ఠానే ఈ సినిమాకు కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. చిత్రంలో సంజయ్ దత్ హీరోగా నటిస్తూనే నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో సాయికుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ హిందీ రీమేక్‌లో సంజయ్ దత్, జాకీ ష్రఫ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా మనీషా కొయిరాలా, చంకీ పాండే, అమైరా దస్తుర్, అలీ ఫజల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ లోగా 'ప్రస్థానం' తనదే అంటూ కోర్టులో కేసు నమోదు కావడం చిత్రయూనిట్‌కి షాకిచ్చింది.

ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ అయిన షీ మారు ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్ వారు 'ప్రస్థానం' హిందీ రీమేక్ రైట్స్ తమవే అని ఆరోపిస్తున్నారు. తమ సినిమాను అనుమతి లేకుండా రీమేక్ చేస్తున్నారనేది వారి వాదన. గతంలోనే ఈ విషయాన్ని సంజయ్ దత్ దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోకుండా 'ప్రస్థానం' సినిమాను రీమేక్ చేశారని, అందుకే లీగల్ నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని షీమారు ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిథి తెలిపారు. చూడాలి మరి దీనిపై సంజయ్ దత్ స్పందన ఎలా ఉంటుందనేది.


Click it and Unblock the Notifications











