దర్శకుడు క్రిష్‌పై కంగనా సోదరి ఎదురు దాడి, ఆమెను వదిలేయ్ అంటూ...
కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి స్పందన వస్తోంది. ఆదివారంతో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 50 కోట్లు వసూలు చేసింది. అయితే విడుదల తర్వాత దర్శకుడు క్రిష్ .. కంగనా రనౌత్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మీడియాలో చర్చనీయాంశం అయింది.
'మణికర్ణిక' చిత్రీకరణ సమయంలో కంగనా మూర్ఖంగా ప్రవర్తించిందని, షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత చరిత్రను వక్రీకరించే మార్పులు కోరిందని, అందుకు తాను అంగీకరించలేదని, నిర్మాతలు కూడా ఆమె వైపే ఉండటంతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి పూర్తయిన సినిమాలో మార్పులు చేసిందని క్రిష్ తెలిపిన సంగతి తెలిసిందే.

ఎదురుదాడి ప్రారంభించిన కంగనా సోదరి రంగోలి
కంగనా మీద ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా... వెంటనే తిప్పికొట్టడానికి సిద్దంగా ఉండే ఆమె సోదరి రంగోలి క్రిష్ ఆరోపణలపై ఎదురు దాడి ప్రారంభించారు. కంగనా విజయానందంలో ఉంటే నీ గొడవ ఏమిటి, కాస్త తగ్గవయ్యా... అంటూ విరుచుకుపడ్డారు.

నా సోదరిని వదిలేయ్...
కంగనా రనౌత్ ప్రస్తుతం విజయోత్సాహంలో ఉంది. అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. ఈ సమయంలో ఆమెను కాస్త వదిలేయ్.. అంటూ క్రిష్‌కు ట్విట్టర్ ద్వారా సూచించారు రంగోలి.

సరే.. మొత్తం నువ్వు చేశావ్
డైరెక్టర్ క్రిష్... సినిమా మొత్తం మీరే డైరెక్ట్ చేశారని మేము ఒప్పుకుంటున్నాం. మీరు చెప్పింది మేము పూర్తిగా నమ్ముతున్నాం.. దయచేసి మీరు ఆరోపణలు చేయడం ఆపండి అంటూ రంగోలి సూచించారు. అయితే రంగోలి చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త వెటకారంగా ఉండటం గమనార్హం.

క్రిష్ ఆవేదన అదే...
క్రిష్ ఇంతలా ఆవేదనకు గురికావడానికి కారణం... చిత్రీకరణ సమయంలో ఆమె తన పనితీరును తప్పుబట్టే ప్రయత్నం చేయడమే. అంతే కాదు సినిమా మొత్తం రూపొందించిన తనకు దర్శకుడిగా ఫస్ట్ క్రెడిట్ ఇవ్వక పోవడం, తన పేరు ఎవరూ గుర్తించలేని విధంగా టైటిల్స్‌లో వేయడం ఆయన్ను బాధించింది.

70 శాతం క్రిష్ దర్శకత్వంలోనే..
‘మణికర్ణిక' చిత్రం షూటింగ్ గతేడాది జూన్‌లోనే పూర్తవ్వడంతో పాటు ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే కంగనా ఇందులో అసంబద్ధమైన మార్పులు కోరడం, నిర్మాతలు కూడా కంగనా వైపే ఉండటంతో ఆయన తప్పుకున్నారు. తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కంగనా తనకు నచ్చిన విధంగా దాదాపు 25 శాతం నుంచి 30 శాతం మార్పు చేశారు.

చరిత్రను వక్రీకరించారంటున్న క్రిష్
కథలోని సదాశివరావు అనే పాత్రలో మార్పులు చేయడం ద్వారా చరిత్రను కంగనా వక్రీకరించిందని క్రిష్ వాదిస్తున్నారు. ఆ పాత్ర పోషిస్తున్న సోనూ సూద్ కూడా తన పాత్ర నిడివి సగానికి తగ్గించడంతో తప్పుకున్నారని, కంగనా ఆరోపిస్తున్నట్లు మహిళ దర్శకత్వంలో చేయడం ఇష్టం లేక కాదని క్రిష్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











