కాస్టింగ్ డైరెక్టర్ల వల్లే ఇలాంటి చోటు చేసుకుంటున్నాయి: రాధిక ఆప్టే కామెంట్
నటి రాధిక ఆప్టే తన మనసులో ఏముంటే ఆ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రధానంగా చర్చనీయంశం అయివుతున్న 'వారసత్వం', 'రెమ్యూనరేషన్ విషయంలో ఆడ, మగ మధ్య సమానత్వం లేక పోవడం'పై స్పందించారు.
వారసత్వం అంశంపై స్పందిస్తూ... 'ఔట్ సైడర్ అనే పదం నాకు నచ్చదు. నేను ఒక వేళ డైరెక్టర్ అయితే నా కొడుకు యాక్టర్ అవ్వాలనుకోవడం సహజం. అలాంటపుడు అతడిని నేను ఎందుకు పరిచయం చేయకూడదు? ప్రస్తుతం ఇండస్ట్రీలో వారసులు ఉన్నారు, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినవారు ఉన్నారు.' అని రాధిక ఆప్టే చెప్పుకొచ్చారు.

అటు వారసులున్నారు, ఇటు టాలెంట్ ఉన్నోళ్లు
రణవీర్ సింగ్, దీపిక పదుకోన్, కంగనా రనౌత్ లాంటి వారు ఎలాంటి సినీ వారసత్వం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి పెద్ద స్టార్లుగా ఎదిగారు. మరో వైపు స్టార్స్ కిడ్స్‌గా పరిచయం అయి తమ టాలెంటుతో పైకొచ్చివారు ఉన్నారని రాధిక ఆప్టే అభిప్రాయ పడ్డారు. టాలెంట్ ఉంటేనే ఎవరైనా స్టార్లుగా ఎదుగుతారు అని తెలిపారు.

కాస్టింగ్ డైరెక్టర్ల వల్లే..
మనం ఒక డ్రామా స్కూలుకు వెళితే అక్కడ ఏ పాత్రకు ఎవరు సరిపోతారో ఆడిషన్స్ ద్వారా నిర్ణయిస్తారు. అక్కడ అంతా ఫెయిర్‌గా ఉంటుంది. కానీ బాలీవుడ్లో కాస్టింగ్ డైరెక్టర్ల వల్ల ఇక్కడ కొన్ని విషయాల్లో ఊహించని మార్పులు, చెత్త సంఘటనలు జరుగుతున్నాయని రాధిక తెలిపారు.

ఆ విషయంలో మార్పు రావాలి
రెమ్యూనరేషన్లో సమానత్వం లేదు అనే విషయంపై స్పందిస్తూ... ‘సల్మాన్ ఖాన్ వల్ల రూ. 200 కోట్లు వస్తాయి, నా వల్ల కేవలం 1 కోటి మాత్రమే వస్తుంది అనే పరిస్థితి ఉన్నపుడు.. సల్మాన్‌కే ఎక్కువ చెల్లించాలి. ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు. అయితే వసూళ్లతో సంబంధం లేని యాక్టర్ల రెమ్యూనరేషన్ విషయంలో చాలా అంతరం ఉంది. లీడ్ క్యారెక్టర్ తల్లిగా చేసే వారి కంటే తండ్రి పాత్ర చేసే వారికి ఎక్కువ ఇస్తున్నారు. ఈ విషయంలో ఆడ మగ అంతరంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది' అని రాధిక వెల్లడించారు.

రాధిక ఆప్టే
రాధిక ఆప్టే సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన బ్రిటిష్-అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది వెడ్డింగ్ గెస్ట్' ఇటీవల విడుదలైంది. దీంతో పాటు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి అంధాధున్ చిత్రంలో నటించింది. ఈ మూవీ ఇప్పుడు చైనాలో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.


Click it and Unblock the Notifications











