ఆరు నెలలు లైంగికంగా వేధించాడు, నా మససు, శరీరం పాడైంది: రాజ్ కుమార్ హిరానీపై ఆరోపణలు
మున్నాభాయ్ సిరీస్ మూవీస్, 3 ఇడియట్స్, పికె, సంజు లాంటి చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరానీ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో బాలీవుడ్ చిత్రసీమలో హాట్ టాపిక్ అయింది. హిరానీ వద్ద 'సంజు' సినిమాకు అసిస్టెంటుగా పని చేసిన ఓ మహిళ చేసిన ఆరోపణలను ఉటంకిస్తూ ఇంటర్నేషనల్ పత్రిక హాఫింగ్టన్ పోస్ట్ సంచలన కథనం వెలువరించింది.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుమార్ హిరానీ తన లాయర్ ద్వారా ఖండించారు. తన క్లయింట్ పేరు, ఇమేజ్ దెబ్బతీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు లాయర్ స్పష్టం చేశారు. ఈ కథనానికి సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిద్దాం.

ఆరు నెలల పాటు వేధింపులు
రాజ్ కుమార్ హిరానీ వద్ద ‘సంజు' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన మహిళ... హిరానీ తనను మార్చి 2018 నుంచి సెప్టెంబర్ వరకు పలు సందర్భాల్లో లైంగిక వేధింపుకు గురి చేసినట్లు ఆరోపణలు చేశారు.

ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు..
రాజ్ కుమార్ హిరానీ ద్వారా లైంగిక వేధింపులకు గురైన సదరు మహిళ నవంబర్లో సంజు సహ నిర్మాత విధు వినోద్ చోప్రా, అతడి భార్య, జర్నలిస్ట్ అనుపమ చోప్రా, హిరానీ క్లోజ్ అసోసియేట్, స్క్రిప్టు రైటర్ అభిజిత్ జోషి, చోప్రా సిస్టర్ షెల్లీ చోప్రాకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

నా మనస్సు, శరీరం, హృదయం పాడైపోయింది
రాజ్ కుమార్ హిరానీ ఏప్రిల్ నుంచి తనను ఇంట్లో, ఆఫీసులో వేధించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆరు నెలలు అతడి వల్ల నా మనస్సు, శరీరం, హృదయం పాడైపోయింది. తన కెరీర్ గురించి ఆలోచించి అతడి వేధింపులు భరించినట్లు బాధిత మహిళ తన ఈమెయిల్‌లో పేర్కొన్నారు.

ఖండించిన హిరానీ
అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుమార్ హిరానీ తన లాయర్ ఆనంద్ దేశాయ్ ద్వారా ఖండించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. అయితే ఈ విషయమై విను వినోద్ చోప్రా స్పందించలేదు. ఆయన భార్య మాట్లాడుతూ ఫిర్యాదు దారుకి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఆ పోస్టర్ నుంచి హిరానీ పేరు తొలగింపు
షెల్లీ చోప్రా దర్శకత్వంలో సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ఎక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' చిత్రం పోస్టర్ నుంచి హిరానీ పేరు తొలగించారు. మొదట ఈ చిత్రాన్ని వినోద్ చోప్రా ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు పోస్టర్లు రిలీజ్ చేశారు.


Click it and Unblock the Notifications











