స్టార్ హీరో దెబ్బ .. 250 కోట్ల అప్పుల్లో రకుల్ ప్రీత్ ఫ్యామిలీ.. అతనికి ముందే తెలుసా?
పాన్ ఇండియా సినిమాల దెబ్బకి, ముఖ్యంగా టాలీవుడ్ దెబ్బకి బాలీవుడ్ సామ్రాజ్యం బీటలు వారుతోంది. మాస్, మసాలా, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో తెలుగు సినిమాలు హిందీ మార్కెట్‌పై దండెత్తుతున్నాయి. మన సినిమాలు అలవోకగా వందల కోట్లు కలెక్ట్ చేస్తుంటే హిందీ సినిమాలు 100 కోట్లు దాటడానికి ఆపసోపాలు పడుతోంది. మధ్యలో కొన్ని సినిమాలు హిట్ అయినా బాలీవుడ్‌కి అవేవీ ఊరట కలిగించలేకపోతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ ఏ రేంజ్‌లో ఇండియన్ సినిమాను డామినేట్ చేసిందో ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి టాలీవుడ్ వచ్చింది.

సౌత్‌వైపు బాలీవుడ్ స్టార్స్ చూపు
బాలీవుడ్‌లోని పరిస్ధితుల దృష్ట్యా అక్కడి నటీనటులు , సాంకేతిక నిపుణులు దక్షిణాది వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు దక్షిణాది చిత్రాల్లో నటించడమో .. దక్షిణాది హీరోలను తమ సినిమాల్లో భాగం చేసుకోవడమో చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, సైఫ్ అలీఖాన్, బాబీ డియోలు, సన్నీ డియోల్, అమితాబ్ బచ్చన్, జాన్వీ కపూర్, దీపిక పదుకొణె తదితరులు తెలుగు సినిమాల్లో నటించారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ .. ప్రస్తుతం హృతిక్ రోషన్ సరసన వార్ 2లో నటిస్తున్నారు. ఈ సినిమా కనుక హిట్ అయితే బాలీవుడ్‌లో ఎన్టీఆర్ జెండా పాతినట్లే.
బాలీవుడ్‌పై నాని వ్యాఖ్యలు
నానాటికీ దిగజారుతోన్న బాలీవుడ్ పరిస్ధితిపై హిందీ నటులే కాకుండా దక్షిణాది నటులు ముఖ్యంగా తెలుగు హీరోలు కూడా స్పందిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ, నటీనటులపై బాలీవుడ్ నటులు అక్కసు వెళ్లగక్కడంతో మనవాళ్లు ధీటుగానే బదులిస్తున్నారు. తాజాగా కొద్దిరోజుల క్రితం నేచురల్ స్టార్ నాని కూడా బాలీవుడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సౌత్ సినిమాల్ని హిందీ వాళ్లు చిన్నచూపు చూసేవారని కానీ ఇప్పుడు బాలీవుడ్‌ను శాసించే రేంజ్‌కి దక్షిణాది ఇండస్ట్రి వచ్చిందని నాని అన్నారు. అయితే బాలీవుడ్ తిరిగి కోలుకుంటుందని ఆయన ఆకాంక్షించారు.
పీకల్లోతు అప్పుల్లో బాలీవుడ్ నిర్మాతలు
కాగా.. సినిమాలు డిజాస్టర్లుగా మారడంతో పలువురు బాలీవుడ్ నిర్మాతలు ఆర్ధికంగా ఇబ్బందులు నష్టపోతున్నారు. వీరిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ కుటుంబం కూడా ఉంది. ప్రముఖ నిర్మాత , పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత వాసు భగ్నానీ కుమారుడే జాకీ భగ్నానీ. ఈయన 2009లో వచ్చిన కల్ కిస్ నే దేఖ అనే సినిమాతో నిర్మాతగా, హీరోగా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఓ పది సినిమాల్లో హీరోగా నటించగా.. దిల్ జంగిల్, వెల్ కమ్ న్యూయార్క్, కూలీ నెంబర్ 1, బెల్ బోటమ్ వంటి సినిమాల్ని నిర్మించి సక్సెస్‌ఫుల్ నిర్మాత అనిపించుకున్నాడు.
బడేమియా ఛోటేమియాకు 250 కోట్ల నష్టాలు
అయితే గతేడాది అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన బడేమియా ఛోటేమియా సినిమాను నిర్మించారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి రూ.110 కోట్లు మాత్రమే వసూలు భారీ నష్టాలను మిగిల్చింది. బడేమియా కారణంగా జాకీ భగ్నానీ తండ్రి వాసు తీవ్ర ఇబ్బందులను పడ్డారని.. రూ.250 కోట్ల అప్పులను తీర్చడానికి ముంబైలోని కొన్ని ఆస్తులను అమ్మేసినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఇష్యూపై జాకీ స్పందించారు.
ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు
బడేమియా ఛోటేమియాను ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించామని.. కానీ చిత్రీకరణ దశలోనే ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాదని అనుకున్నామని, రిలీజ్ అయ్యాక తమ అనుమానమే నిజమైందని జాకీ తెలిపారు. ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఈ సినిమాను తెరకెక్కించామని , ఈ బాధ ఎవరికీ అర్ధం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బడేమియా ఘటనతో జీవితంలో పెద్ద గుణాపాఠం నేర్చుకున్నామని జాకీ భగ్నానీ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











