రామ్ గోపాల్ వర్మ నెక్ట్స్ మూవీ ‘వైరస్’... స్టోరీ ఇదే!
రామ్ గోపాల్ వర్మ అంటేనే ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరు. అందరి దర్శకుల్లా రోటీన్ సినిమాలు తీయకుండా సరికొత్త కాన్సెప్టులను ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంటాడు. అవి ప్రేక్షకులకు నచ్చుతాయా? లేదా? అనే సంగతి గురించి పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగా సినిమాలు తీయడం ఆయన స్టైల్. ఇటీవల ఆయన తీసిన 'ఆఫీసర్' ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీసు వద్ద పెద్ద డిజాస్టర్ అయింది.
వర్మ సినిమాలు ఎక్కువగా ముంబై నేపథ్యంలో సాగుతుంటాయి. గతంలో 26/11 దాడుల నేపథ్యంలో సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు ముంబైని వణికించిన ఓ వ్యాధి గురించి సినిమాగా తీయబోతున్నారు. ఈ సినిమాకు 'వైరస్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పరాగ్ సంఘ్వీ నిర్మాత.

'ఎబోలా కంటే భయంకరమైనది ఈ వైరస్. గత 40 ఏళ్లలో దాదాపు పది అంతుపట్టని వైరస్‌లు ముంబయిని కుదిపేశాయి. ఈ నేపథ్యంలో ఓ కొత్త వైరస్ వ్యాధి ముంబైలో వ్యాప్తిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రపంచంలోని బయో శాస్త్రవేత్తలందరూ కంగారుపడుతున్నారు. ఈ వైరస్ గురించి క్షేత్రస్థాయిలో రీసెర్చ్ చేసి వర్మ సినిమా తీయబోతున్నారు. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటిస్తాం... అని నిర్మాత సంఘ్వీ తెలిపారు.
ఈ సినిమా స్టోరీ గురించి వర్మ వెల్లడిస్తూ...
'ఓ విద్యార్థి సెంట్రల్ ఆఫ్రికాకు వెళతాడు. అక్కడి నుంచి తిరిగి ముంబై వచ్చాక ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతుంటాడు. ఆ వ్యాధి ఇతరులకూ వ్యాపించి యావత్ ముంబైని వణికిస్తుంది. ఇలాంటి వ్యాధి ముంచెత్తుతుందని ఊహించని ప్రభుత్వం.. ప్రజలంతా ఒకరి నుంచి ఒకరు 20 అడుగుల దూరంలో ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తుంది.
కానీ 2 కోట్ల మంది జనాభా ఉన్న ముంబయిలో మనుషుల మధ్య అంత దూరం పెంచడం సాధ్యం కాని పని. వ్యాధి వ్యాప్తిచెందుతుండడంతో అతి తక్కువ సమయంలోనే లక్ష మందికిపైగా మృత్యువాతపడతారు. దాంతో ప్రభుత్వం ఇతర ప్రదేశాలతో సంబంధాలను తాత్కాలికంగా తెంచుకుంటుంది. వ్యాధి సోకని వారు భయంతో నగరం నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ, ఎవరెవరికి వ్యాధి సోకిందో తెలీదు కాబట్టి అలా పారిపోతే ఇతరులకు వైరస్ సోకుతుందన్న భయంతో పారిపోవాలని చూసేవారిపై ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు జారీ చేస్తుంది.
అలా వ్యాధి నుంచి బయటపడలేక ప్రజలు, వారిని కాపాడుకోలేక ప్రభుత్వం ఈ వైరస్ కారణంగా ఎలా సతమతమైంది? అన్న నేపథ్యంలో సినిమా తీయబోతన్నాం. భయం, బాధ, ప్రేమ, త్యాగం, ఆశ ఇలా అన్ని అంశాలను జోడించి ఓ మానవీయ కోణంలో దీనిని తెరకెక్కిస్తున్నాం అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











